Read more!

సమానత్వం గురించి మాట్లాడేవారికొక చక్కని విశ్లేషణ!

ప్రస్తుత సమాజంలో కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. నెలజీతం అందుకొన్న మొదటి పదిరోజులు ఆఘమేఘాలపై తేలిపోతుంటారు. అచ్చం అమెరికన్ కాపిటలిస్టుల వైఖరిలో వారికీ వీరికీ పార్టీలు ఇచ్చేస్తారు. వీరిలో దర్జాతనం అంతా వెలిగిస్తారు. విలాసంగా ఖర్చు చేస్తారు. ఆ తర్వాత పదిరోజుల పాటు చేతిలో డబ్బు చాలనందువల్ల సోషలిస్టు భావాలు పెరుగుతాయి వాళ్లలో. దేశసంపదని ప్రజలందరికీ న్యాయంగా పంపిణీ చేస్తే బాగుంటుందని ప్రకటించడం మొదలుపెడతారు. అలాంటి వ్యక్తి నెల చివరి పదిరోజుల్లోనూ డబ్బులకు గిజగిజ ఎక్కువై, కమ్యూనిస్టు భావాలకు లోనవుతాడు. భాషలో కాఠిన్యం ఎక్కువ చోటుచేసుకుంటుంది. ముఖ్యంగా  ధనికుల్ని ఏం చేసినా పాపం లేదంటాడు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్నే అంతం చేయాలంటాడు.

ఆ నెలకు ముఫ్పై ఒక్క రోజులుంటే నెల చివరిరోజున అతడి పరిస్థితి చెప్పనక్కరలేదు. చేబదులు కూడా పుట్టని కారణం వల్ల ఆరోజుకు కావలసిన కాఫీ ఫలహారాలకోసం స్నేహితుల గుంపు మధ్యకు వెళ్ళి కూచుంటాడు. ఆ చివరిరోజున అతడి ధోరణి యావత్తూ అనార్కిస్టుగా కనిపిస్తుంది. ఈ సమాజంలోని అసమానత్వాలను కూకటి వ్రేళ్ళతో పెరికి వేయాలంటాడు. కనిపించిందంతా ధ్వంసం చేయాలంటాడు. ఆ మర్నాడు చేతిలో జీతం రాళ్ళు పడగానే అంతకు ముందు ప్రకటించిన భావావేశమంతా తగ్గి, మళ్ళీ ముందులాగా కాపిటలిస్టులాగా తృప్తిగా నవ్వుతూ వుంటాడు.

ఒక పాశ్చాత్యుడి వద్ద బట్లర్ ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి శుక్రవారం యజమాని అనుమతి పొంది నగర కమ్యూనిస్టు మీటింగుకు శ్రద్ధగా వెళ్ళి తిరిగొస్తుండేవాడు. కొన్ని మాసాలు గడిచిన తర్వాత బట్లర్ అనుమతి అడిగే శుక్రవారం వచ్చినప్పటికీ అతడు తన వద్దకు రాకపోవడం గమనించి అతడి యజమాని, "ఏమి, ఇవాళ మీటింగుకు వెళ్తున్నట్లు లేదే?" అని అడిగాడట. 

"వెళ్లటం లేదండీ. పోయినసారి మీటింగుకు వెళ్ళినప్పుడు మన ఫ్రాన్సుదేశ సంపదని మన జనాభాకు సరిసమానంగా పంచితే మనిషి ఒక్కింటికి నెలకు ఏడువందల ఎనభై ఎనిమిది ఫ్రాంకులు ముట్టుతాయని ఎవరో ప్రసంగిస్తూ అన్నారు. నా నెల జీతం ఎనిమిది వందల ఫ్రాంకులైనప్పుడు నేను ఆ పార్టీలో వుండడం అనవసరమని అనిపించింది. అందువల్ల మానేశాను" అని సమాధానమిచ్చాడట.

పూర్వం కాథరిన్ మెకాలే అనే ప్రసిద్ధ చరిత్ర రచయిత్రి వుండేది. సాంఘిక సమానత్వం గురించి ఆవిడ చాలా ఆవేశపడుతుండేది. పదిమంది మేధావులు తన ఇంట డిన్నర్ కు కూచున్న వేళల్లో తన విశ్వాసాన్ని గట్టిగా ప్రకటిస్తుండేది. ఆనాటి మహారచయిత, ప్రసిద్ధ నిఘంటుకర్త అయిన డాక్టర్ జాన్సన్, డిన్నర్ వద్ద ఆవిడ చేసిన ఘాటైన ప్రసంగం విని మొహం సీరియస్గా పెట్టి, “అమ్మా, మీ ప్రసంగం నన్ను పూర్తిగా మార్చేసింది. మీ వాదన నాకు చాలా సహేతుకంగా కనిపిస్తున్నది. మనుషులందరూ సమానమే కాబట్టి అందర్నీ ఒకటిగా చూడాలనే మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడాను. ఈ మాటలు నేను హృదయ పూర్వకంగా అంటున్నాననే విషయం రుజువు చేయడానికి ఇప్పటికిప్పుడే ఒక సూచన చేస్తున్నాను. ఇక్కడవున్న మీ పరిచారకుడు చాలా మర్యాదస్తుడు, నెమ్మదైనవాడు. పెద్ద మనిషి, ఇతడు మనతో బాటు ఈ డైనింగ్ టేబిల్ వద్ద కూచొని భోజనం చేయాలని నా ఆకాంక్ష" అన్నాడు. 

డాక్టర్ జాన్సన్ చేసిన ఈ ప్రతిపాదనను కాథరిన్ మెకాలే అగ్రహంతో తిరస్కరించింది. జాన్సన్ లోలోన నవ్వుకొని ఆ తర్వాత తన అంతరంగికులతో మాట్లాడుతూ “అందర్నీ సమానం చేసేయాలనే ఆవిడ వాదన ఎంత అసంబద్ధమైనదో ఆరోజున ఆవిడకలా తెలియజేశాను. ఆనాటి నుండి నేనంటే ఆవిడకంత గిట్టేది కాదు. అందరూ సమానమేనని సిద్ధాంతీకరించే ఈ ప్రబుద్ధులు తమకన్నా పై శ్రేణిలో వున్న వారితో తాము సమానమవాలని కోరుకుంటారేగానీ తమ క్రింది వర్గాలవారితో తాము సమానంగా వ్యవహరించడానికి అంగీకరించరు." అని అన్నారు జాన్సన్.

                                    ◆నిశ్శబ్ద.