బలుపు కాదు వాపు! దేశంలో బీజేపీకి 37శాతం ఎమ్మెల్యేలే..
posted on Dec 28, 2021 @ 4:00PM
దేశంలో ప్రస్తుతం బీజేపీదే హవా.. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే కాంగ్రెస్ కనీసం బీజేపీకి దరిదాపుల్లో కూడా లేదు.. ఇది దేశ జనాల్లో ఉన్న అభిప్రాయం. పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల లెక్కలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని రూలింగ్ పార్టీల జాబితా తీసినా ఇదే నిజమేనని అనిపిస్తుంది. దేశంలో 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ప్రెసిడెంట్ రూల్ అమలులో ఉంది. మిగితా 30 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో బీజేపీనో, దాని మిత్రపక్షమే అధికారంలో ఉంది. అంటే మొత్తంగా దాదాపు 60 శాతానికి పైగా అధికారం కమలం చేతిలోనే ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం పంజాబ్, ఛత్తీస్ గఢ్ లో మాత్రమే అధికారంలో ఉంది. రాజస్ఖాన్ లో కాంగ్రెస్ పవర్ లో ఉన్నా.. ఆర్జేడీ మిత్రపక్షంగా ఉంది. అంటే కాంగ్రెస్ వాటా కేవలం 10 శాతం మాత్రమే. మిగితా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు.
ఈ జాబితా చూస్తే దేశంలో బీజేపీకి తిరుగేలేదని అర్ధమవుతోంది. అయితే సమగ్రంగా విశ్లేషిస్తే మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీకి కేవలం 37 శాతం ఎమ్మెల్యేలే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4139 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో బిజెపికి 1516 సీట్లే ఉన్నాయి. ఈ లెక్కన దేశంలోని 63 శాతం అసెంబ్లీ సీట్లతో బీజేపీ ఓడిపోయిందని స్పష్టమవుతోంది. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల్లోనూ 950 సీట్లు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపి, ఎంపి, రాజస్థాన్ వంటి 6 రాష్ట్రాల నుండే ఉన్నారు.అంటే ఈ ఆరు రాష్ట్రాల్లోనే బీజేపీ 65 శాతం మంది ఎమ్మెల్యేలున్నారు. మిగితా 24 రాష్టాల్లో కేవలం 35 శాతం మంది బీజేపీ ఎమ్మెల్యేలే. 31 రాష్ట్రాల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది తొమ్మిది రాష్ట్రాల్లోనే. ఈ లెక్కలనే చూపుతూ కమలం పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
సిక్కిం, మిజోరం, తమిళనాడు అసెంబ్లీలో కమలం పార్టీ ఖాతా కూడా తెరవలేదు. 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీకి గుండు సున్నానే. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ ఒక్క చోట మాత్రమే గెలిచింది. పంజాబ్ లో 117కు మూడు, బెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్లకుగాను 3, ఢిల్లీలో 70కి మూడు సీట్లు బీజేపీకి ఉన్నాయి. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలోనే గెలిచినా.. తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్ రెండు ఉప ఎన్నికల్లో గెలవడంతో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ఒడిషాలో 147 స్థానాలుండగా 10 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. నాగాలాండ్ లో 60 సీట్లు ఉండగా... బీజేపీకి 12 స్థానాలున్నాయి.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి పెద్దగా సీట్లు లేవు. మేఘాలయలో బీజేపీ కూటమి పవర్ లో ఉన్నా.. అక్కడ కమలానికి ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే. బీహార్ లో 243 సీట్లు ఉండగా 53 స్థానాలు గెలిచిన బీజేపీ.. జేడీయూతో కలిసి అధికారం పంచుకుంటోంది. గోవాలో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నా... ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న బలం 13 మాత్రమే. ఇక ప్రస్తుతం ప్రెసిడెంట్ రూల్ ఉన్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ 87 సీట్లు ఉండగా.. బీజేపీ 25 సీట్లు గెలిచింది. ఈ వివరాల ప్రకారం దేశంలో బీజేపీ అత్యంత శక్తివంతంగా ఉందని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తదేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.