నేను నెంబర్ వన్ యాక్టర్‌ని కాదు..కానీ : పవన్ కళ్యాణ్
posted on Jan 9, 2026 @ 2:18PM
తాను నెంబర్ వన్ యాక్టర్‌ను కాకపోయిన తన సినిమా ప్లాప్ అయిన డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ తనకు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ప్రజల మద్దతు, ప్రేక్షకులకు మద్దతునే ఇది తనకు సాధ్యమైందని పవన్ తెలిపారు. అయిన సరే తాను రాజకీయాల్లోకి ఎందుకువచ్చానంటే...ప్రజాసేవను తాను బాధ్యతగా భావించానని చెప్పారు.
పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా బిగ్ న్యూస్ అయిపోతుందని డిప్యూటీ సీఎం అన్నారు. పిఠాపురంలో తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి మానవ సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. తాను పిఠాపురం శాసన సభ్యుడిగా గెలిచిన కేవలం ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని తెలిపారు. మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేస్తామన్నారు.
పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థలా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఫంక్షన్లకు హాజరు కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ తెలిపారు. తాను ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విన్నవించారు.తాను నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని డిప్యూటీ సీఎం తెలిపారు.