పెంచారు సరే.. అసలిస్తారా?.. పెన్షన్లపై వృద్ధుల ఆందోళన
posted on Dec 26, 2022 6:23AM
ఏపీలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల లో రూ. 250 పెంపునకు జగన్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జగన్ క్యాబినెట్ నిర్ణయంతో ఇప్పుడిస్తున్న పెన్షన్‌పై రూ.250 పెరగనుంది. అంటే ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది. పెన్షన్ దారులకు ప్రభుత్వం ఇస్తున్న నూతన సంవత్సర కానుక అని చెప్పుకుంటోంది. వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు అమల్లోకి రానుంది.
అయితే పెన్షన్ పెంపుపై పెన్షన్ దారుల్లో మాత్రం ఇసుమంతైనా ఆనందం కనిపించడం లేదు. పెన్షన్ పెంచారన్న ఆనందం కంటే అసలు వచ్చే నెలలో పెన్షన్ ఉంటుందా? అన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో వచ్చే నెల నుండి 50 వేల పింఛన్లు తొలగించనున్నారన్న వార్త తెగ ప్రచారం అవుతుండటమే. ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు ఎవరి పెన్షన్లు తొలగించాలని అనుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు పింఛన్ల మంజురూలో ఎలాంటి నిబంధనలు లేవు. కానీ, ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నవాళ్లు, 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఎవరి పెన్షన్ కట్ చేస్తున్నారో వాళ్ళకి వాలంటీర్లు నోటీసులు కూడా ఇస్తున్నారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొంటున్నారు.దీంతో వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలలో ఆందోళన మొదలైంది. వచ్చే నెలలో తన పెన్షన్ వస్తుందా లేక సాకులు చెప్పి కట్ చేస్తారా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమౌతున్నాయి.
కొత్త సంవత్సరంలో పెన్షన్ పెంపు శుభవార్త వింటామా.. పెన్షన్ కట్ అనే చేదు వార్త వింటామా అన్న ఆందోళన నెలకొంది. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల తొలగింపు చేపడితే అది ప్రతిపక్షాలకు ఆయుధం అవ్వడమే కాకుండా ప్రభుత్వానికి కొత్త చిక్కులు రావడం తథ్యం. మరి జగన్ సర్కార్ తొలగింపు నిర్ణయంతో ముందుకు వెళ్తుందా, ఎన్నికలు, ఓట్ల భయంతో వెనక్కు తగ్గుతుందా చూడాల్సి ఉంది. ఇప్పటికే తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. ఇది మరింత పెరిగేలా పెన్షన్ల రద్దు విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.