గవర్నర్ వర్సెస్ సీఎం.. తమిళ సభలో కొత్త చిత్రం
posted on Jan 10, 2023 @ 11:34AM
తమిళనాడు అసెంబ్లీకి మంచి చరిత్ర వుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం.. కొండకచో ముష్టిఘాతలకు పాల్పడడం .. మొదలు మినీ వస్త్రాపహరణ యత్నాల వరకు.. చాలా చాలా అవాంఛనీయ సంఘటనలకు తమిళనాడు అసెంబ్లీ వేదికగా నిలిచిన ఘన చరిత్ర వుంది. అఫ్కోర్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్త్ర ప్రదేశ్ రాష్ట్రాలలోనూ, నిండు సభలో ప్రతిపక్ష నేత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనల వంటివి చాలానే జరుగుతున్నాయి అది వేరే విషయం. ఇప్పుడు తమిళనాడు శాసనసభలో మరో మారు... మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణం. అది ఎక్కడైనా ఉన్నదే. జరిగేదే. కానీ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని.. వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని చెప్పారు. దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు.
గవర్నర్ తన ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు పదాన్ని పలకలేదని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రసంగం కాపీల్లో తమిళనాడు అని ఉన్నా.. గవర్నర్ ప్రస్తావించకపోవడంపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించింది.
అయితే, ఇది ఎదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే కాదు, తెలంగాణలో ఎలాగైతే, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధం నడుస్తోందో, తమిళ నాడులోనూ చాలా కాలంగా ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య అలాంటి యుద్ధమే నడుస్తోంది. అందులో భాగంగానే ఈ పరిణామాన్ని చూడాలి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమత్రి స్టాలిన్ ప్రభుత్వం మధ్య గతంలో ‘నీట్’ పరీక్ష విషయంలో, ఇటీవల కోయంబత్తూర్ లో జరిగిన కారు విష్పోటనం విషయంలో వివాదం తలెత్తింది.
ఈ వివాదాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చందూ అసలు గవర్నర్ వ్యవస్థే అనవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర పదవి అనవసరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్ పెండింగులో పెట్టడం ఏ మేరకు సమంజసమని జస్టిస్ చందూ ప్రశ్నించారు.
అయితే బిల్లులను పెండింగ్ లో పెట్టే అధికారం భారత రాజ్యాంగమే గవర్నర్ కి కల్పించిందని, మరో వాదన వుంది. నిజానికి కేంద్రంలో రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ ఎప్పటికప్పడు వివాదస్పద మవుతోందని, ఈ నేపధ్యంలో బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను కొనసాగించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇప్పడు మళ్ళీ మరో మారు అదే చర్చ మొదలైంది.