ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం
posted on Jan 10, 2023 @ 11:21AM
తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం అడ్డుగా మారుతోందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయా? ఉభయ తెలుగు రాష్ట్రల సరిహద్దు జిల్లా రాజకీయాలు తెలంగాణ రాజకీయాలలో కీలకం కానున్నాయా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. తెలుగుదేశం పార్టీ గత డిసెంబర్ 21న ఖమ్మంలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించింది. అనూహ్యంగా టీడీపీ సభ సూపర్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ అవడమే కాదు రాష్ట్ర రాజకీయాలని కొత్త మలుపు తిప్పింది. కొత్త చర్చకు దారి చూపింది. తెరాస, భారాసగా మారి జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అడుగులు వేస్తున్న నేపధ్యంలో టీడీపీలో చాలా కాలం తర్వాత తెలంగాణ గడ్డమీద సభ నిర్వహించం, ఈ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది.
అదలా ఉంటే కొత్త సంవత్సరం (2023) జనవరి ఫస్ట్ న ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార భారాస ముఖ్య నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి ఒకరు పాలేరులో ఇంకొకరు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు అధికార బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూతా తిరుగుతున్నాయి. ఇటు తుమ్మల, అటు పొంగులేటి ఒకే సారి అసమ్మతి గళం వినిపించడం ఆ ఇద్దరు పార్టీతో సంబంధం లేకుండా రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించడం, అందుకు కొనసాగింపుగా ఆ ఇద్దరు పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగడంతో అధికార బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు.
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో పాటుగా ఇతర మంత్రులు ముఖ్య నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మరో వంక పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమై, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న ఢిల్లీలో అనుకున్న భారాస ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఢిల్లీ లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి.. కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. దీంతో ఖమ్మం రాజకీయాలపై మీడియా ఫోకస్ పెరిగింది.
అదలా ఉంటే అదే రోజున పొంగులేటి, ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. అయితే, పొంగులేటి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారా లేక, ఒక రోజు తర్వాత జనవరి 19 న హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో పార్టీలో చేరతారా అనే విషయంలో కొంత క్లారిటీ రావలసి వుంది. ప్రధాని మోడీ జనవరి 19న హైదరాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలో పొంగులేటి పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు .అయితే చిత్రంగా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో కాలు పెట్టింది మొదలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూనే తిరుగుతున్నాయి.