విపక్షాల ఐక్యతా యత్నాలు సవ్యంగా సాగేనా?
posted on Jan 10, 2023 @ 1:08PM
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అధికార పక్షంలో కాదు ప్రతి పక్షాల్లోనే హడావుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత అనుభవం దృష్ట్యా చివరి క్షణంలో ఐక్యతా ప్రయత్నాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని, అధికార బీజేపీని ఎదుర్కొవడం అంత తేలికైన టాస్క్ కాదనీ అర్దమవ్వడమే. 2014, 2019లో ఎన్నికలలో విపక్షాల అనైక్యతే బీజేపీకి అదనపు బలంగా మారిందన్నసంగతి అన్ని రాజకీయ పార్టీలూ గ్రహించేశాయి. అయినా విపక్షాల మధ్య ఐక్యతా యత్నాల ధోరణి ఎవరి దారి వారిదే అన్నట్లుగానే ఉంది. భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించారు. సరే ఇక ఆరంభం అవుతాయా అనుకునేలోగానే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు కూటమి అయినా, పొత్తులున్నా.. రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సిందే నంటూ కండీషన్ ను తెరమీదకు తీసుకు వచ్చారు. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఐక్యతా రాగం ఆలపించగలిగితేనే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నకల నాటికి ఐక్యత బలపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది వివిధ అసెంబ్లీలకు జరిగే ఎన్నికలలో విపక్షాలు సంఘటితంగా సత్తా చూపే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రావడం లేదు. 2014, 2019 సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏక తాటి మీద నిలబడి పోటీ చేసి సత్ఫలితాలను అందుకున్నాయి. కానీ, సార్వత్రిక ఎన్నికల విషయం వచ్చే సరికి ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎల్.డి, బి.ఎస్.పి, ఎస్.పిలు కలిసి కేవలం 15 స్థానాలు మాత్రమే చేజిక్కించుకోగా, బీహార్‌లో ఆర్.జె.డి, జె.డి.యు, కాంగ్రెసులు ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి. ఈ విషయం ఎవరికి అర్ధమైనా కాకున్నా రాహుల్ గాంధీకి మాత్రం పూర్తిగా బోధపడిందని అర్ధమౌతున్నది. ప్రతిపక్షాలు ఈ సారైనా ప్రజల దగ్గరికి ఒక విజన్‌తో వెళ్లాలి. ఈ విజన్ బీజేపీ విజన్ కు ప్రత్యామ్నాయంగా ఉండాలి. అది లేకుండా కలిసి కట్టుగా జనం ముందుకు వెళ్లినా ఫలితం ఆశించిన విధంగా ఉండదని ఆయన ఇప్పటికే తేటతెల్లం చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, డి.ఎం.కె, వామ పక్షాలు బీజేపీకి బద్ధ శత్రువులే అయినప్పటికీ, 2014 నుంచి ఈ పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతకు దూరంగా ఉంటున్నాయి.
రాహుల్ గాంధీ చెప్పినట్టు, ప్రతిపక్షాల ఐక్యత అనే ది సీట్ల పంపకం స్థాయి దాటి లోతుకు వెళ్లాలి. కానీ బీజేపీ వ్యతిరేక కూటమికి సారథి ఎవరు అనే విషయంలోనే విపక్షాల మధ్య బేధాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. ఇప్పటికింకా ఐక్యతా యత్నాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కానీ, విపక్ష ఐక్య కూటమికి నాయకుడెవరన్న విషయంలో చర్చోపచర్చలు అయితే మొదలైపోయాయి. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ సహా పలువురు నాయకులు ఈ రేసులో మేమున్నామంటూ అప్పుడే సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా,ఉన్నప్పటికీ విపక్షాల ఐక్యతకు సారథ్యం విషయంలో మాత్రం కాంగ్రెస్ నేనున్నానంటూ అగ్రతాంబూలం కోసం రెడీ అయిపోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న సంగతి విదితమే. అక్కడ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందన్న విశ్వాసం అయితే ఆ పార్టీలో గట్టిగా కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై పెద్దగా విశ్వాసం కనబరచడం లేదు. ఇప్పటికిప్పుడైతే విపక్షాల ఐక్య కూటమికి కాంగ్రెస్ నాయకత్వాన్ని మెజారిటీ పక్షాలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా ప్రతిపక్షాల ఐక్యత గురించి ముందుగా ప్రస్తావించారు. ఆయన ప్రతిపాదనకు, ఆయన చెబుతున్న డిఫరెంట్ విజన్ అంశానికీ విపక్షాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ వైవిధ్యాలను చక్కదిద్ది, వాటిని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్‌కు లేదా రాహుల్ గాంధీకి ఉన్న అర్హతలేమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాలలో సర్క్యలేట్ అవుతోంది. సొంత పార్టీలో విభేదాల పరిష్కారానికే చెమట్లు కక్కుతున్న కాంగ్రెస్ ఇక విపక్షాల మధ్య రాజకీయ ఐక్యత ఏ విధంగా తీసుకురాగలదని పరిశీలకులు అంటున్నారు. ఉదాహరణగా తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరి పాకాన పడ్డ విభేదాల పరిష్కారంలో కాంగ్రెస్ అధిష్ఠానం వైఫల్యాన్ని చూపుతున్నారు.