Read more!

వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి గోల్డెన్ రూల్స్ ఇవీ!

ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే..


పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం.

పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది.


భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది.


ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం.


భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.


                                            *రూపశ్రీ.