షర్మిల పార్టీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత గట్టు
posted on Jan 3, 2022 @ 3:10PM
వైఎస్ షర్మిల పార్టీలోకి మళ్లీ వలసలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ కీలక నేత గట్టు రామచంద్రరావు వైఎస్సార్ టీపీలో చేరారు. పార్టీ అధినేత్రి షర్మిల సమక్షంలో గట్టు రామచంద్రరావు వైస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకున్నారు. గట్టుకు పార్టీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు షర్మిల. టీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నారు గట్టు రామచంద్రరావు. అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ ను వివిధ వేదికలపై బలంగా వినిపించారు. ఎమ్మెల్సీ సీటును ఆశించిన ఆయనకు కేసీఆర్ హ్యాండిచ్చారు. దీంతో గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి షర్మిల పార్టీలో చేరారు గట్టు రామచంద్రరావు.
వైసీపీ టీపీలో చేరిక తర్వాత మీడియాతో మాట్లాడిన గట్టు.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావన్నారు. టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్నారు. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదని తెలిపారు. వైఎస్సార్‌కి జిరాక్స్ కాపిలా షర్మిల కనిపిస్తోందని చెప్పారు. షర్మిల పార్టీలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. బండి సంజయ్‌ను రాజకీయంగా కేసీఆర్ ఎందుకు హైలెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ తపన పడుతున్నారని విమర్శించారు. అందుకే తెలంగాణలో బీజేపీని కేసీఆర్ హైలెట్ చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, కేసీఆర్ కలిసి పని చేస్తారని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు గట్టు రామచంద్రరావు వైఎస్సార్ టీపీలో చేరడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. షర్మిల పార్టీలో చేరిన నేతల్లో కొందరికి నెలవారీగా వేతనాలు ఇస్తున్నారనే టాక్ ఉంది. దీంతో గట్టు రామచంద్రరావుకు ప్యాకేజీ ఎంతో అన్న సెటైర్లు టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నాయి.