జగన్ మంత్రులకు ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్.. పరువంతా తీసేశాడుగా...
posted on Jan 3, 2022 @ 2:26PM
రామ్‌గోపాల్‌వర్మ. పక్కా వైసీపీ సపోర్టర్. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్నికల ముందు టీడీపీని కెలికారు. జగన్ ప్రమాణ స్వీకారానికీ హాజరయ్యారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరింత కవ్వించారు. ఆ రెండు సినిమాల్లానే ఆర్జీవీ సైతం అట్టర్‌ఫ్లాప్. అప్పటి నుంచీ జగన్-వైసీపీ సపోర్టర్‌గానే ఉంటూ వచ్చారు వర్మ. కాలం గడుస్తున్న కొద్దీ.. జగన్ ఎంత ఖతర్నాకో అందరికీ తెలుసొస్తోంది. ఆర్జీవీకి కూడా బాగా కనువిప్పు కలిగింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడాన్ని.. వర్మ తనదైన స్టైల్‌లో విశ్లేషించారు. మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్‌లకు సినిమా గురించి అసలేమీ తెలీదని తీసిపారేశారు. వాళ్లు చేస్తున్నది ముమ్మాటికీ తప్పు. టికెట్ రేట్లు తగ్గించడం ఇల్లాజికల్.. అని సూటిగా, సుత్తిలేకుండా చెప్పేశారు.
ప్రొడక్ట్ తయారు చేసిన వాడే.. దాని వాల్యూని, ఎమ్ఆర్పీని నిర్ణయించడం న్యాయం. మధ్యలో గవర్నమెంట్‌కు ఏం అవసరం? 100 కోట్ల బడ్జెట్‌కు.. కోటి బడ్జెట్‌కు.. ఒకే టికెట్ ధర ఉండటం దారుణం. ప్రపంచ స్థాయికి టాలీవుడ్ ఎదుగుతున్న క్రమంలో.. జగన్ ప్రభుత్వ నిర్ణయం ముమ్మాటికి తెలుగు సినిమా పరిశ్రమను అణిచివేసే పరిణామమేనని ఆర్జీవీ అన్నారు. మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు చేసిన కామెంట్లను ఆయన తప్పుబట్టారు. వారికి సినిమాల గురించి అసలేమీ తెలీదని అర్థమవుతోందన్నారు. హీరో రెమ్యునరేషన్ సైతం సినిమా బడ్జెట్‌లో భాగమేనని.. హీరోను బట్టే సినిమా ఆడుతుందని.. సినిమా బడ్జెట్‌ను, హీరో రెమ్యునరేషన్‌ను వేరుగా చూడలేమని.. మంత్రి అనిల్‌కు అవగాహన లేదని వర్మ తేల్చేశారు.
టికెట్ ధరల తగ్గింపుతో కొందరు హీరోలకు చెక్ పెడదామనుకుంటే అది వర్కవుట్ కాదన్నారు వర్మ. హీరోల రెమ్యునరేషన్‌ను ఎవరూ తగ్గించలేరని.. టికెట్ ధరలతో వారి డిమాండ్ ఏమీ తగ్గదని.. ఆ మేరకు మిగతా వారికి ఇచ్చే సొమ్ము.. వచ్చే లాభం తగ్గిపోతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ఎవరికీ లాభం చేకూర్చదని.. ఇది సినిమా పరిశ్రమను నాశనం చేసే శాపమని ఆర్జీవీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. తమ వాడైన వర్మ చెప్పాకైనా.. వైసీపీ దిగొస్తుందా? టికెట్ రేట్లపై పునరాలోచన చేస్తుందా? లేదంటే, తగ్గేదే లే.. అంటుందా?