ఏపీలో ఈ అరాచక పాలనేంటి?
posted on Jan 3, 2022 @ 3:19PM
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతోందని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. మొన్నామధ్య మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి బస్టాండ్ సెంటర్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని పట్టపగలే వైసీపీ నేత శెట్టిపల్లి యలమంద కొడుకు కోటేశ్వరరావు సుత్తితో ధ్వంసం చేశాడు. కోటేశ్వరరావు దాడిలో ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది. గతంలో నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దుర్గి బంద్ నిర్వహించాయి. దీంతో టీడీపీ శ్రేణుల ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు దుర్గిలో 144వ సెక్షన్ విధించడం, టీడీపీ నేతలను ఎక్కడివాళ్లను అక్కడే నిర్బంధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దుర్గి వెళ్లకుండా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దుర్గి వెళ్తున్న బ్రహ్మారెడ్డిని ఒప్పిచర్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డిని కూడా పోలీసులు గృహనిర్బంధం చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వందల కిలోమీటర్లు కారులో తిప్పిన వైనాన్ని మరిచిపోక ముందే.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లి రవీంద్రను కూడా ఓ కేసులో అదుపులోకి తీసుకుని ఊళ్లు తిప్పి మరీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై అప్పట్లో వైసీపీ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వైసీపీ పాలనలోని లోపాలను మీడియాలో ఎత్తిచూపుతున్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిని ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. పట్టాభిపైనా దాడిచేసి గాయపర్చిన వైనం గుర్తుండే ఉంటుంది. వైసీపీ తీరును ప్రశ్నించారనే సాకుతో విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపైనే బట్టలు విప్పించి పోలీసులు అవమానించారు. మరో మహిళా వైద్యురాలిని కూడా ముప్పు తిప్పలు పెట్టిన వైనం మీడియాలో రావడం గమనార్హం. జగన్ పాలన రెండున్నరేళ్లలో ఒకటి కాదు రెండు కాదు ఇలా అనేక మందిని ఇబ్బందులకు గురిచేసిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
జగన్ కేబినెట్ లోని ఒక మంత్రి బూతుల మంత్రిగా పేరుపొందారు. మరో మంత్రేమో రాజధాని అమరావతి ప్రాంతాన్ని స్మశానంతో పోలుస్తారు. రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ నోటికొచ్చినట్లు కూతలు కూస్తాడు ఇంకో మంత్రి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణిని కించపరిచేలా బహిరంగంగానే విమర్శలు చేసే స్థాయికి దిగజారిపోవడంతో జనం అంతా ముక్కున వేలేసుకున్నారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని గృహిణుల పట్ల కూడా వైసీపీ నేతలు ఇలా దారుణంగా మాట్లాడడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్ర చేస్తుండగా అనేక ఇబ్బందులు పెట్టింది వైసీపీ సర్కార్. చివరికి మహా పాదయాత్రికులు కనీసం కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోడానికి, అన్నం తినడానికి కూడా మార్గంలో ఎవ్వరూ సహకరించకుండా చేయడం మీడియా ముఖంగా అందరూ చూసిందే. అలాంటి పరిస్థితిలో మహా పాదయాత్రలో పాల్గొన్న రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు రోడ్ల మీదే కూర్చుని భోజనాలు చేయాల్సిన దుస్థితిని కల్పించింది వైసీపీ సర్కార్ . చివరికి మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి, అమరావతి రాజధాని అవసరాన్ని ప్రపంచానికి చాటి చెబుదామనుకున్న ఆందోళనకారులకు అనుమతి నిరాకరించింది. చివరికి హైకోర్టు ఆదేశంలో తిరుపతి శివారులో అమరావతి మహా పాదయాత్ర చేసిన అన్నదాతలు సభ నిర్వహించుకోవాల్సి వచ్చింది.
కాగా.. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడం వెనుక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు,కార్యకర్తలు హద్దుమీరి అహంకారంతో ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆయన కుమారుడు రామకృష్ణ స్పందిస్తూ.. ఎన్టీఆర్ అభిమానులం అని చెప్పుకునే వైసీపీనేతలు నిద్రపోతున్నారా? అంటూ ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడి పునరుజ్జీవింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే తెలుగు జాతిని అవమానించినట్లే అని ఆగ్రహం వ్యవక్తం చేశారు.
రెండున్నరేళ్ల పాలనలో ఇలాంటి అరాచకాలు ఏపీలో ఎన్నో జరుగుతున్నాయి. అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి దిగజార్చేసిన సీఎం జగన్ గ్రాఫ్ బాగా పడిపోయినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. జగన్ పాలనపై ప్రజల్లో 81 శాతం మంది అసంతృప్తితో ఉన్నారని, ఆయనపై తీవ్ర వ్యతిరేకత నెలకొందనే విషయం ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం.