జనాలకు బిగ్ షాక్.. ఊహించని రీతిలో పెరగనున్న గ్యాస్ ధరలు..
posted on Oct 28, 2021 @ 10:15AM
దేశంలో నిత్యావసరాల ధరలు రోజుకురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు రికార్జులు తిరగరాస్తున్నాయి.లీటర్ పెట్రోల్ రేట్ కొన్ని ప్రాంతాల్లో 120 రూపాయలకు చేరింది. డీజిల్ రేటు కూడా సెంచరీ దాటి పెట్రోల్ తో పోటీ పడుతూ దూసుకుపోతోంది. గ్యాస్ ధరలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి.
పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి మరో బిగ్ షాక్ తగలబోతుందని తెలుస్తోంది. వంట గ్యాస్ ధరలను మరింతగా పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సిలిండర్‌పై ఏకంగా రూ.100 వరకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి, దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందునే తాము కూడా ధరలను పెంచాల్సి వస్తోందని చమురు, సహజవాయు కంపెనీలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. జూలై నుంచి ఇప్పటివరకు రూ.90కిపైగా సిలిండర్ ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952గా ఉంది.
మరోవైపు ధన ధరలు రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. సెప్టెంబర్ 28 నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 సార్లు పెరుగుతూ వచ్చింది. అదే విధంగా డీజిల్ ధర 24 సార్లు పెరుగుతూ వచ్చింది. తాజాగా గురువారం హైదరాబాద్‌లో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.112.63ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ..105.84గా ఉంది.