కొందరికి 10 వేలు.. కొందరికి 6 వేలు! డబ్బుల కోసం హుజురాబాద్ ఓటర్ల ఆందోళనలు..
posted on Oct 27, 2021 @ 9:43PM
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్ల కొనుగోలుకు తెర లేచింది. గతంలో ఎన్నడూ లేని రేటు పలుకుతోంది. ఎన్నికల ప్రచారం ఇంకా ముగియక ముందే ఒక్కో ఓటుకు అక్షరాలా ఆరు వేలు పలుకుతోంది. పోలింగ్ నాటికి ఓటుకు రేటు ఎంత పెరుగుతుందోననే అంచనాలు భారీగా సాగుతున్నాయి. ఒక్కో ఓటుకు రూ. 10 వేలు ఇస్తారన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కవర్లలో పెట్టి కానుకల మాదిరిగా డబ్బు పంచుతున్న వైనం బయటపడింది. దీపావళి బోనస్ గా ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున పంచుతున్నారు. తెల్లవారుజామున ఎవరికంటా పడకుండా ఈ కరెన్సీ కట్టల పంపిణీ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే ఓటుకు రూ. 10 వేల చొప్పున కూడా పంచుతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఓట్ల కొనుగోలు కార్యక్రమంలో కూడా పక్షపాతం చూపుతున్న కారణంగా డబ్బు అందని ప్రజలు ఈ విషయాన్ని భరించలేక బహిరంగంగానే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ పూర్తి నిఘా ఏర్పాటు చేసిన అధికార పక్షం ఓటర్ లిస్టును ముందు పెట్టుకొని, బూత్ ల వారీగా ఆరా తీస్తూ స్థానిక వార్డు లెవల్ ఇంచార్జుల ఆధారంగా ఏ వ్యక్తి ఏ పార్టీకి ఓటేస్తాడో అంచనా వేస్తున్నారు. ఈ అంచనా ప్రకారమే అధికార పక్షం డబ్బు పంచుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారమే ఓటరుకు రూ. 6 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి ఒక్కో కవరులో వారికి రావాల్సిన మొత్తాన్ని పెట్టి పంచుతున్నారు. అయితే పంపిణీ చేసే సమయంలో కూడా ఎవరి మీదనైనా అనుమానం వస్తే అలాంటి కవర్లను పంపిణీ చేయకుండా ఆపేస్తున్నారు. దీంతో కవర్లు అందనివారు అధికార పక్షం తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.
తమ ఇంట్లో 4 ఓట్లుంటే రూ. 24 వేలు రావాలని.. అలాంటిది తమకు కవరు అందలేదని ఓ మహిళా ఓటరు అక్కసు వెళ్లగక్కుతోంది. తన భర్త బీజేపీలో తిరుగుతున్నందువల్లే డబ్బు రాలేదంటున్నారని, ఆయన బీజేపీలో ఎప్పుడు తిరిగాడో వాళ్లే చెప్పాలని బహిరంగంగా నిలదీస్తోంది. ఇదే క్రమంలో అటు బీజేపీ కూడా ఓటర్లను ఆకర్షించేందుకు అనువైన అన్ని మార్గాలనూ అనుసరిస్తోంది. అధికార పార్టీ అయినా, విపక్షమైనా ఆఖరు నిమిషంలో తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, పక్కాగా తమ గుర్తుకే ఓటు పడేందుకు ఎంతో కొంత ముట్టజెబుతూ ఓట్లను కన్పామ్ చేసుకుంటున్నారు.
ఇక హైకమాండే స్వయంగా పంపిణీ చేయాలని డబ్బు ఇచ్చినప్పుడు లోకల్ లీడర్లు ఎందుకు ఆపుతున్నారని, ఇంత అన్యాయం పనికిరాదని, కరోనా తరువాత సామాన్య కూలీల దగ్గర డబ్బే దొరకని పరిస్థితుల్లో కూడా పక్షపాతం ఎందుకు చూపుతున్నారంటూ.. ఆ మహిళకు ఇరుగుపొరుగువారు వత్తాసు పలుకుతుండడం విశేషం. ఇవ్వనివాళ్లు ఎలాగూ ఇవ్వడం లేదు.... కనీసం ఇచ్చేవారైనా సమన్యాయం పాటించాలి కదా అంటూ.. అమాయకత్వంగా అడుగుతున్నారు. ఇదే పరిస్థితి నియోజకవర్గం అంతటా ఉందని, అయితే పంపిణీ సరిగ్గా జరగకపోయినా అది డబ్బు పంచే పార్టీలకు మైనస్ గా మారక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ లో అక్రమాలు ఏ లెవల్ జరుగుతాయో గ్రహించిన ఈసీ.. ఇప్పటికే 20 కంపెనీల అదనపు బలగాలను మోహరించింది. అటు బీజేపీ, కాంగ్రెస్ వంటి ముఖ్యమైన పార్టీల ఫిర్యాదులను కూడా ఈసీ పరిగణనలోకి తీసుకుంది. పకడ్బందీగా, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. అయినా ప్రతిరోజూ తెల్లవారుజామున నోట్ల పంపిణీ జరుగుతుండడం చూస్తే నియోజకవర్గంలో పార్టీల ప్రలోభాల స్థాయి ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. ప్రచారం చివరి అంకంలో పడ్డ ఈ దశలోనైనా నోట్ల పంపిణీ ఆగిపోయేలా ఈసీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గత చాలా కాలంగా 2 వేల నోట్లు కనిపించడమే లేదు. కానీ హుజూరాబాద్ లో బయటపడుతున్న నోట్లన్నీ 2 వేలవే కావడం విశేషం.