మోడీకి ఆర్ఎస్ఎస్ సెగ?.. మెజారిటీ తగ్గితే రిప్లేస్ మెంటేనా?
posted on May 25, 2024 @ 3:13PM
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారాన్ని అందుకునే స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న ప్రబలమైన శక్తి ఆర్ఎస్ఎస్ అన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. అందుకే రైటిస్టుల్లో లెఫ్టిస్టుగా పేరు పొందిన వాజ్ పేయి కూడా తన నిర్ణయాలు, విధానాల అమలు విషయంలో ఆర్ఎస్ఎస్ అనుమతి, సలహాలు, సూచనలూ తీసుకునే వారని ఆయన కేబినెట్ లో పని చేసిన వారే కాదు, ఆయన సహచరుడిగా గుర్తింపు పొందిన అద్వానీ కూడా పలు సందర్భాలలో చెప్పారు.
ఇక ప్రస్తుతానికి వస్తే గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పలు నిర్ణయాల విషయంలో ఆర్ఎస్ఎస్ సలహాలూ, సూచనలనూ ఇసుమంతైనా ఖాతరు చేయకుండా వ్యవహరించిందని బీజేపీ వర్గాలే అంటుంటాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ తో రాజకీయంగా ఎదిగిన వారిని ఒక్కొక్కరినీ మెల్లిమెల్లిగా పక్కన పెడుతూ మోడీ పార్టీలో ఏకైక నేతగా ఎదిగేందుకు ప్రయత్నించారనీ, అందుకు ఆయనకు అమిత్ షా పూర్తిగా సహకరించారనీ అంటారు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను పక్కన పెట్టే విషయంలో ఆర్ఎస్ఎస్ అభ్యంతరాలను ఇసుమంతైనా పట్టించుకోలేదని చెబుతారు. వయస్సు సాకుగా చూపి అద్వానీ, జోషీలను పక్కన పెట్టేసిన మోడీ, షా ద్వయం.. ఇప్పుడు ఏడు పదుల వయస్సుకు చేరువైన మోడీ విషయంలో మాత్రం వయస్సు విషయానికి పట్టింపు లేదన్నట్లుగా మాట్లాడడాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు.
ఇంత కాలం వేచి చూసే ధోరణి అవలంబించిన ఆర్ఎస్ఎస్ ఇక మోడీ విషయంలో సీరియస్ గా ఆలోచించకతప్పదన్న నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది. ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ పెర్మార్మెన్స్ ఏ మాత్రం తగ్గినా ఆ ప్రభావం నేరుగా మోడీపైనే పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్నిటికీ మించి ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో విఫలమై.. అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి వస్తే ఆర్ఎస్ఎస్ కచ్చితంగా ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తీసుకువచ్చే అవకాశలే మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
మంద బలం ఉంటే భయంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అణిగిమణిగి ఉంటాయే తప్ప.. బీజేపీ సొంత బలం సన్నగిల్లితే మాత్రం భాగస్వామ్య పక్షాలేవీ కూడా మోడీ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశాలు లేవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ లో బీజేపీ పెద్దగా పెర్మార్మ్ చేయలేదనే పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. యోగేంద్ర యాదవ్ వంటి స్ట్రాటజిస్టులు అయితే బీజేపీ సొంతంగా గెలుచుకునే స్థానాలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల తరువాత బీజేపీలో పెనుమార్పులు సంభవించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.