విభజన గాయాలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి! నష్టపోతోంది సీమాంధ్ర ప్రజలే!
posted on May 25, 2024 @ 3:14PM
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పదేళ్ల తర్వాత విభజన చట్టంలోని పలు అంశాలకు కాలం చెల్లుతుంది. అయితే ఏపీ నేతలు తమకేమీ పట్టనట్లు తడిబట్ట వేసుకొని నిద్దురపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విభజన పూర్తి కాలేదు.
1. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, కార్పొరేషన్‌లు ఉన్నాయి. చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది.
2. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, 2016వ సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, దాదాపు రాష్ట్ర పరిపాలన కార్యాలయాలను ఏపీలోని అమరావతికి మార్చారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. ఏపీకి ఇప్పటికీ పూర్తిస్థాయి రాజధాని అందుబాటులోకి రాలేదు. మరో వైపు ఉమ్మడి రాజధాని విషయంపై ఏపీ చేతులు ఎత్తేసింది.
3. ఆర్టీసీ ఆస్తుల వివాదం ఇప్పటి వరకు తేలలేదు. విభజన చట్టంలో ఆర్టీసీ ఆస్తులను 10 ఏళ్లలోగా పరిష్కరించుకోవాలని.. చెప్పారు. ఆ తర్వాత.. అని ఎక్కడా చెప్పలేదు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణాలోని ఆర్టీసీ ఆస్తుల్ని పూర్తిగా తీసుకునేలా చక్రం తిప్పుతోంది. ఇది ఏపీ ఆర్టీసీకి ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరింది. దానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించింది. షీలా భిడే ప్యానెల్ ఇచ్చిన హెడ్‌క్వార్టర్స్ నిర్వచనం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు తమకు చెందినవని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని, తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తామని తెలంగాణా నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాలేదు.
4. హైదరాబాద్‌లోని ఏపీ భవనాలు.. కార్యాలయాల విషయం కూడా తేలలేదు.
5. ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణా నుంచి 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.
6. ఉద్యోగుల పంపిణీ కూడా అలానే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 144 మంది తెలంగాణ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలో పనిచేస్తున్నారు. వీరిని వెనక్కి తీసుకురావాలని, తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం మే 18వతేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించింది.
7. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంచలన ఆదేశాలు ఇచ్చారు. అదేమిటంటే, జూన్ 2 తర్వాత తమ పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాలను తెలంగాణలో కలిపేయాలని లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారు. ఏపీకు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని సి.ఎం. అధికారులకు ఆదేశించారు.
ఆంధ్ర రాష్ట్ర సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. వైసీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో నోరెత్తలేదు. విభజన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. విభజిత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అలా పదేళ్ళు గడిచిపోయాయి. అయితే రాష్ట్రం ఇబ్బందులు తనకేమీ పట్టనట్టుగా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోంది.
తెలుగువారు రెండు ముక్కలు కావడం. తద్వారా ఢిల్లీ స్థాయిలో వారి పలుకుబడి, ప్రాభవం తగ్గింది. అసలు ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసేందుకు జాతీయ పార్టీలు ఉమ్మడిగా చేసిన కుట్రలో భాగమే రాష్ట్ర విభజన అని ఆంధ్ర మేధావులు చెబుతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు రాష్ట్రాలను తమ రాజకీయ ప్రయోగశాలలుగా మార్చేశాయి. అయితే ఈ ఆటలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. బీజేపీ ఏమాత్రం ప్రయోజనం పొందగలదనేది భవిష్యత్తులో తేలనుంది. ఒకటి మాత్రం నిజం ఈ క్రూరమైన రాజకీయ క్రీడలో దారుణంగా నష్టపోయింది మాత్రం సీమాంధ్ర ప్రజలు.
- ఎం.కె. ఫజల్