కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రాబోతోందా?
posted on May 31, 2024 @ 3:26PM
ఈసారి జనరల్ ఎలక్షన్ల తొలిదశ పోలింగ్ జరిగే వరకూ కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తుంది అనే మాట అనడానికి చాలామందికి ధైర్యం చాలని పరిస్థితి. ఏ యాంగిల్లో ఆలోచించి బీజేపీ ప్రభుత్వం రాదని అనుకుంటున్నావయ్యా అని ఎవరైనా నిలదీస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకపక్క బీజేపీ వాళ్ళు గత పది సంవత్సరాలుగా దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారంటూ నినదించే గొంతులు ఎక్కువ అయ్యాయి. ఆ నినాదాలో హోరులో వున్నవాళ్ళకి వేరే ఆలోచన కూడా రాలేని పరిస్థితి. పైగా మోడీ గారు అయోధ్యలో రామాలయాన్ని కూడా ప్రారంభించేశారు కాబట్టి ఉత్తర భారతదేశం మొత్తం భక్తి పారవశ్యంలో ఊగిపోతోందని.. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, రామాలయం కట్టించిన మోడీకి అర్జెంటుగా ఓటు వేసేసి రుణం తీర్చుకోవాలా అని ఉత్తర భారతదేశంలోని ఓటర్లుందరూ ఉవ్విళ్ళూరుతున్నారని బిల్డప్పు క్రియేట్ అయింది. ఆ తర్వాత ఒక్కో దశ ఎన్నికలు ముగిసేకొద్దీ.. ఇటు దక్షిణ భారతదేశంలోగానీ, అటు ఉత్తర భారతదేశంలోగానీ మోడీ మంత్రం పెద్దగా పనిచేయలేదనే ‘వేవ్’ కనిపించింది. 400 సీట్ల మోడీ డ్రీమ్ నెరవేరే అవకాశాలు లేవేమోనన్న సందేహాలు ప్రారంభమయ్యాయి. అలా ఒక్కో భ్రమలు తొలగుతూ ప్రస్తుతం బీజేపీకి ఒంటరిగా గానీ, ఎన్డీయే కూటమికి గానీ పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదనే అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నికల ఫలితాలు అటు ఇటు ఎన్డీయే కూటమితోపాటు అటు ఇండియా కూటమి కూడా నువ్వా నేనా అనే నిలిచేలా వుంటాయని అనిపిస్తోంది. అలాంటి పరిస్థితే వస్తే ఇప్పుడున్న రెండు కూటములూ అటూ ఇటు అయ్యి కొత్త కూటములు ఏర్పడే అవకాశం వుంటుంది. పోలింగ్ సరళిని గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో వున్న పార్టీలను ఆకర్షించే పనిలో పడింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని. ‘‘తెలుగుదేశం మా పాత మిత్రపక్షమే’’ అనే కామెంట్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అంటే అర్థం ఏమిటి? ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీల కొత్త సమీకరణ అవసరమైన పక్షంలో టీడీపీని సంప్రదించడానికి మేం ఎంతమాత్రం మొహమాటపడం అని. బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రాని పక్షంలో మోడీ ప్రధానిగా మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకోవడం కష్టమే. కాంగ్రెస్ తన చాణక్యం ప్రదర్శించిందంటే, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం అసాధ్యమయ్యే అవకాశం కూడా వుంది.