Read more!

రాష్ట్రంలో ప్రియాంకకి ఏం పని చిరూ?

 

 

 

ఎన్నికలు ముగిశాయి. అటు కేంద్రంలో, ఇటు రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్లు ఫిక్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు సర్వనాశనమయ్యామా అన్న ఆలోచనలో, అంతర్మథనంలో వుంది. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు సోనియమ్మని, రాహులయ్యని కలిసి తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాశనమైపోయిందీ వివరిస్తున్నారు.

 

కాంగ్రెస్ అధినేత్రి తిడితే బాధపడుతున్నారు. ఓదారిస్తే రిలీఫ్ అవుతున్నారు. మొన్నామధ్య తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్ళి సోనియా, రాహుల్ చేత తలంటు పోయించుకుని, ముఖాలని నయాపైస అంతగా మార్చుకుని తిరిగి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన ఇన్నాళ్ళ తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి తీరిగ్గా ఢిల్లీకి వెళ్ళి సోనియాని, రాహుల్‌కి కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకం పడిపోవడానికి గల కారణాలను పూస గుచ్చినట్టు వివరించారు. జరిగిందేదో జరిగిపోయింది సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కృషి చేయండని సోనియా వాళ్ళతో అన్నారు. ఇక్కడి వరకు బాగానే వుంది. ఇక్కడ చిరంజీవి ప్రదర్శించిన అతి వినయం అందరికీ నవ్వు తెప్పించేలా వుంది.

 

సోనియా మేడమ్ దగ్గరకి వెళ్లినప్పుడు చిరు గారికి ప్రియాంక గారు కనిపించారట. అంతే వెంటనే చిరంజీవికి ఒక వండర్‌ఫుల్ ఐడియా వచ్చింది. వెంటనే ఆయన ప్రియాంకని కలిసి మీరు మా రాష్ట్రంలో పర్యటించాలని ఆహ్వానించారు. దానికి ప్రియాంక స్పందించి సరే అన్నారు. ఈ అంశంలో చిరంజీవికి సూటి ప్రశ్నలు ఏమిటంటే, 1. అసలు ప్రియాంకని తమరు రాష్ట్రానికి ఎందుకు ఆహ్వానించారు? 2. ప్రియాంక ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం ఒరుగుతుంది? 3. ఆంధ్రప్రదేశ్‌లో ప్రియాంక పర్యటించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒనగూడే లాభమేంటి? ఈ ప్రశ్నలకి చిరంజీవి గారు అర్జెంటుగా సమాధానాలు చెప్పాలి.