ఏపీలో ఉచిత బస్సు సర్వీసు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
posted on Mar 11, 2025 @ 12:58PM
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు సర్వీసు మొదలైపోయిది. అయితే అది సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కాదు. ఇది వేరు. కానీ ఇది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ కూడా కాదు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన వెసులు బాటు. ఔను మంగళగిరిలో ఉచిత బస్సు సౌకర్యాన్ని లోకేష్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందు కోసం లోకేష్ విజ్ణప్తి మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీసీఆర్) కింద రెండు ఎలక్ట్రికల్ బస్సులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా అందజేసింది.
ఈ బస్సుల రాకతో.. నియోజకవర్గం ప్రజలకే కాకుండా.. ఇక్కడున్న ఎయిమ్స్, పలు ముఖ్య ఆలయాలకు వచ్చే భక్తులు, రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 18 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ బస్సులు మంగళగిరి బస్టాండ్ నుంచి ఎయిమ్స్ వరకూ అలాగే మంగళగిరి బస్టాండ్ నుంచి పానకాల స్వామి ఆలయం వరకూ నడుస్తాయి.
ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ, అదే విధంగా పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ నడుస్తుంది. వీటిని సోమవారం (మార్చి 10)న ప్రారంభించిన మంత్రి లోకేష్ వీటిని మంగళగిరి ప్రజలకు అంకితం చేస్తున్నేట్లు ప్రకటించారు.