చంద్రబాబుతో అనుబంధం వెరీ స్పెషల్ అంటున్న సోము!
posted on Mar 11, 2025 @ 11:35AM
పొత్తు సాకుగా చూపి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన పబ్బం గడుపుకుంటోంది. తెలుగుదేశం వ్యతిరేకులకు కూటమి కోటాలో పదవులు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. అయినా చంద్రబాబు మిత్రధర్మం, కూటమి బంధం అంటూ క్యాడర్ ను సముదాయించడానికే ప్రయత్నిస్తున్నారు. అయితే 2019-2024 మధ్య కాలంలో అధికారంలో ఉన్న జగన్ కు వంత పాడి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు ఎమ్మెల్యే కోటీ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ టికెట్ లభించడాన్ని తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. అలాగే జనసేనానిపై కూడా సోము అప్పట్లో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ జనసేన క్యాడర్ కూడా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఏమిటని బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. పబ్బం గడిస్తే చాలన్నట్లుగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్నది.
ఈ నేపథ్యంలో కూటమి పార్టీల అభీష్ఠానికి వ్యితిరేకంగా బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న సోము వీర్రాజు.. ఇప్పుడు చంద్రబాబుతో తన అనుబంధం వెరీ స్పెషల్ అంటున్నారు. ఎంత స్పెషల్ అంటే చంద్రబాబు, మోడీ మధ్య అనుబంధం ఎలాంటిదో.. చంద్రబాబుతో తన అనుబంధం కూడా అలాంటిదేననీ చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజు ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
సోము వీర్రాజు మాజీ సీఎం జగన్ కోవర్టు అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అదంతా అవాస్తవమని చెబుతూ 2019లో జగన్ సీఎం అయ్యేంత వరకూ తనకు ఆయనతో పరిచయం కూడా లేదన్నారు. అయితే చంద్రబాబుతో మాత్రం తొలి నుంచీ ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుడే చంద్రబాబు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని సోము వీర్రాజు చెప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికలలో సోము అసలు పోటీ యే చేయలేదు. ఆ తరువాత ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యారు. అయినా కూడా సోము వీర్రాజు ఎన్నడూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన సందర్భం లేదు.
అంతే కాకుండా రాజధాని అమరావతి విషయంలో కూడా సోము వీర్రాజు జగన్ విధానాలనే సమర్ధించారు. జగన్ హయాంలో సోము వీర్రాజు వ్యవహార శైలిపై బీజేపీ రాష్ట్ర నేతలే మండిపడ్డారు. సోముకు వ్యతిరేకంగా బీజేపీ అధిష్ఠానానికి అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ వచ్కకచిన తరువాత సోము వీర్రాజు ఒక్క సారిగా స్వరం మార్చేశారు. తాను ఎప్పుడూ అమరావతి రాజధానికే మద్దతుగా నిలిచానని చెప్పుకొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కోసం తాను ఎటువంటి లాబీయింగ్ చేయలేదనీ, బీజేపీ అధిష్ఠానమే తన సీనియారిటీకి గుర్తింపుగా టికెట్ ఇచ్చిందని చెప్పుకున్నారు. అంతే కాదు మీడియా ముందు ఆయన తాను ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగా లేననీ, వైసీపీ విధానాలకు గట్టిగా వ్యతిరేకించాననీ చెప్పుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. మీడియా ఎదుట ఆయన ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ, జగన్ హయాంలో ఆయన వ్యవహరించిన తీరును, ఆయన జగన్ అనుకూల వైఖరినీ ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు తాను వైసీపీకి అనుకూలంగా ఎన్నడూ వ్యవహరించలేదని ఎంతగా చెప్పుకున్నా ఎవరినీ నమ్మించలేరు.