కరోనా ఆసుపత్రిలో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
posted on Mar 26, 2021 @ 9:38AM
కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కరోనా హాస్పిటల్ లో మంటలు రావడంతో ఇద్దరు కరోనా రోగులు సజీవదహనమయ్యారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్‌లో ఉన్న సన్‌రైజ్ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 76 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురు రోగులు వెంటిలేటర్లపై ఉండగా.. మిగితా 70 మందిని మరో ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మాల్‌లోని మొదటి అంతస్తులో అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించిందని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు.
అగ్ని ప్రమాదం జరిగిన హాస్పిటల్ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. మాల్ లో నిబంధనలకు విరుద్దంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ముంబై నగర మేయర్ కిషోరి పడ్నేకర్ మాట్లాడుతూ.. అసలు ఓ మాల్‌లో ఆసుపత్రి ఉండడాన్ని తాను తొలిసారి చూస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు.