సమస్యలపై మంత్రిని నిలదీస్తూనే ఆగిన రైతు గుండె

రాజధాని అమరావతిలోని మండడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మునిసిల్ శాఖ మంత్రి  నారాయణ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు.   రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా   ఘటన జరిగింది. 

అమరావతిలో ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో  పాల్గొన్న రైతు దొండపాటి రామారావు  తమ సమస్యలపై తొలుత ప్రశాంతంగానే మాట్లాడారు. అయితే మధ్యలో తీవ్ర ఆవేదనకు, ఆవేశానికీ లోనయ్యారు.   ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తమ ఇళ్లు పొలాలూ తీసుకుని రోడ్డున పడేస్తారా అంటూ మంత్రిని నిలదీశారు.  ఆ వెంటనే   గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

 దీంతో అక్కడున్న అధికారులు, రైతులు రామారావుకు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ వెంటనే అతడిని మంత్రి కాన్వాయ్ వాహనంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు అయితే..  అప్పటికే  ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. నిర్వాసిత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.  భూ సమీకరణలో భాగంగా రాములు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు. ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు కోల్పోతున్న వారి జాబితాలో ఆయన ఇల్లు కూడా ఉంది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పులు

  అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని  జేడీ వాన్స్‌ నివాసంపై అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్‌ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీవాన్స్‌ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.  సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. జేడీవాన్స్‌ సెలవుల అనంతరం ఆదివారమే ఆయన వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడు ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ లేదా సీక్రెట్ సర్వీస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు  

జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే?

బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ (ఐఐబీఓఎస్) సమ్మెకు పిలుపు నిచ్చింది. ఈ సమ్మె కారణంగా జనవరి నెలలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. అదెలాగంటే.. జనవరి 24  నాలుగవ శనివారం,  , 25 ఆదివారం రావడం ఆ మరుసటి రోజు సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో వరుసగా మూడు రోజలూ బ్యాంకులకుసెలవు. ఇక 27 మంగళవారం   సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. దీంతో బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు అందుబాటులో ఉండవు.   

ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్....500 కొబ్బరి చెట్లు దగ్ధం

  అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో మంటలు ఇంక అదుపులోకి రాలేదు. సమీపంలోని కొబ్బరి తోటలను మంటలు అంటుకుని...500 కొబ్బరి చేట్లు కాలిపోయినట్లు అంచన వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. చుట్టుపక్కల 5 కి.మీల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు రాజమండ్రి నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.  ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంటలను త్వరితగతిన అదుపు చేసేందుకు ఓఎన్జీసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కోరారు. కాగా, ఉత్పత్తిని పెంచే పనుల్లో భాగంగానే ఈ లీకేజీ జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గ్యాస్‌ లీక్ ఘటనలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని  జిల్లా కలెక్టర్ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ వివరాలను తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు

నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర : లోకేష్

  నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని నిర్మించడంలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వైస్ చాన్సలర్లు కేవలం పరిపాలనాధిపతులు కాకుండా విద్యారంగ సంస్కరణలకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. పుట్టినరోజు రోజున కూడా సమావేశానికి హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పాదయాత్రలో యువత ఆశలు చూశాను తన సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను ప్రత్యక్షంగా కలిశానని, ఉన్నత విద్య పూర్తిచేసినా ఉద్యోగ భవిష్యత్‌పై గందరగోళంలో ఉన్నారని లోకేష్ తెలిపారు. యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే సంకల్పంతోనే సవాళ్లతో కూడిన విద్యాశాఖను స్వీకరించానన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజకీయ నాయకుడు హెచ్ఆర్‌డీ శాఖ చేపట్టడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఐదు కీలక సవాళ్లు పబ్లిక్ యూనివర్సిటీల బలోపేతానికి ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని వీసీలను లోకేష్ కోరారు. బోధన–అవసరాల మధ్య వ్యత్యాసం, కాలానుగుణంగా సిలబస్ మార్పులు, ఉద్యోగావకాశాలు లేని డిగ్రీలు, పరిశ్రమలతో బలహీన అనుసంధానం, ప్రయోజనం లేని పరిశోధనలు, ఆవిష్కరణల లోపం, పరిపాలనపై అధిక సమయం, అకడమిక్ ప్రమాణాలపై తక్కువ దృష్టి, విద్యార్థుల అనుభవంలో సమానత్వం, మానసిక మద్దతు లోపం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఉదాహరణగా తీసుకుని, ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే పాఠ్యాంశాలను తరచుగా పూర్తిస్థాయిలో నవీకరించాల్సిన అవసరం ఉందని లోకేష్ తెలిపారు. విద్య–ఉపాధి మధ్య వారధిగా యూనివర్సిటీలు డిగ్రీలు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని తీసుకురావాలని స్పష్టం చేసిన లోకేష్… పట్టభద్రులు అమీర్‌పేటలో నాలుగు నెలల శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందుతున్న పరిస్థితి మన సంస్థల వైఫల్యమేనన్నారు. ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశ్రమ ఆధారిత కోర్సులు కీలకమని తెలిపారు. పరిశోధన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి పరిశోధన అనేది కేవలం జర్నల్స్‌కే పరిమితం కాకుండా నీటి కొరత, వాతావరణ మార్పులు, వ్యవసాయం, ప్రజారోగ్యం వంటి సమస్యలకు పరిష్కారాలు అందించే దిశగా సాగాలన్నారు. స్టార్ట్‌అప్స్, పేటెంట్లు, టెక్నాలజీ బదిలీలు యూనివర్సిటీల బలాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడండి వైస్ చాన్సలర్లు ప్రతి వారం కొద్ది గంటలైనా విద్యార్థులతో నేరుగా మాట్లాడే “ఓపెన్ హౌస్” కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల అనుభవాలను పట్టించుకోని విశ్వవిద్యాలయాలు ఎంత ప్రతిష్టాత్మకమైనవైనా సమయానుకూలత కోల్పోతాయని హెచ్చరించారు. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలే లక్ష్యం ప్రపంచ స్థాయి పబ్లిక్ విశ్వవిద్యాలయాలే రాష్ట్ర లక్ష్యమని, ఈ దిశగా పూర్తి స్వతంత్రత, ప్రతిభకు గౌరవం ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సమావేశం నుంచి విద్యారంగంలో సరికొత్త ప్రయాణం ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

బంగ్లాదేశ్, ఇండియా మధ్య సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక ఆందోళనల ప్రభావం ఇరు దేశాల మధ్యా దౌత్య సంబంధాలనే కాకుండా అన్ని రంగాలపైనా కూడా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలపై కూడా పడింది.  బంగ్లాదేశ్ స్టార్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు  కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆల్లర్ల కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.  ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాకాండ, హిందూ వ్యతిరేకత బాగా పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. బంగ్లాలో పెచ్చరిల్లుతున్న భారత వ్యతిరేకత కారణంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  ముస్తాఫిజూర్ ను ఐపీఎల్ నుంచి తొల‌గించాల‌ని నిర్ణయించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముస్తాఫిజుర్ ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది. ఆ జట్టులో ముస్తాఫిజుర్ కీలక ఆటగాడిగా రాణిస్తాడని ఆ జట్టు భావించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అతడిని ఐపీఎల్ నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అకారణంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను బాధించిందని పేర్కొన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. అందుకు ప్రతిగా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.   

త్వరలో మావోయిస్టు రహితంగా తెలంగాణ : డీజీపీ

  తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందని తెలంగాణ పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మావోయిస్టులు కేవలం 17 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు పోలీసుల అంచనా. ఈ 17 మందిలో ఎవరు ఏ స్థాయి కమిటీల్లో ఉన్నారనే పూర్తి వివరాలతో కూడిన జాబితా పోలీసుల చేతిలో ఉందని వెల్లడించారు. ఈ 17 మంది లొంగిపోతే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి పూర్తిగా తెరపడుతుందని, అప్పుడే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మిగిలిన మావోయిస్టు నేతలు ఆయుధాలు విడిచి, లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మిగిలి ఉన్న 17 మంది మావోయిస్టుల్లో 4 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు,5 మంది స్టేట్ కమిటీ సభ్యులు,6 మంది డివిజన్ కమిటీ సభ్యులు, ఒకరు అండర్ గ్రౌండ్ కార్యకర్తగా ఉన్నారు. ఈ జాబితాలో 5 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. వీరిలో కొందరు ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో ఉండగా, మరికొందరు స్టేట్, డివిజన్ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ 17 మంది తెలంగాణ మావోయిస్టు అగ్ర నేతలపై పోలీసులు మొత్తం రూ.2 కోట్ల 25 లక్షల రివార్డు ప్రకటించారు. వీరి కదలికలపై నిఘా మరింత పెంచినట్లు, అవసరమైతే ఆపరేషన్ కగార్ పరిధిలో చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లొంగిపోవాలని పోలీసుల పిలుపు ఆపరేషన్ కగార్ పూర్తయ్యేలోపే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. మిగిలిన 17 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం పునరావాస అవకాశాలు కల్పిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తానికి, రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి ముగింపు దశ సమీపిస్తోందని, తెలంగాణ త్వరలోనే పూర్తిస్థాయిలో శాంతియుత రాష్ట్రంగా మారబోతోందని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సెంట్రల్ కమిటీ సభ్యులు ముప్పాల లక్ష్మణ్ రావ్ @ గణపతి తిప్పిరి తిరుపతి @ దేవ్ జి మల్లారాజి రెడ్డి @ సంగ్రామ్ పసునూరి నరహరి @ సంతోష్ స్టేట్ కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్ వార్త శేఖర్ @ మంగుత్ జోడే రత్నా భాయ్ నక్కా సుశీల లోకేటి చంద్ర శేఖర్ దామోదర్ డివిజన్ కమిటీ సభ్యులు రాజేశ్వరి రంగబోయిన భాగ్య బాడిషా ఉంగా సంగీత భవాణి మైసయ్య భగత్ సింగ్

నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు

  అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో జరిగిన ఈ హత్య వెనుక డాలర్ల అప్పు లావాదేవీలు ఉన్నట్టు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖితను హత్య చేసిన వ్యక్తి ఆమె స్నేహితుడు అర్జున్ శర్మేనని హోవార్డ్ కౌంటీ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అర్జున్ శర్మ నిఖిత వద్ద 4,500 డాలర్లు అప్పుగా తీసుకున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నిఖిత కజిన్ సరస్వతి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో వెల్లడించారు. అప్పు తీసుకున్న అర్జున్ శర్మ అందులో 3,500 డాలర్లు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన 1,000 డాలర్లు ఇవ్వకుండా ఆలస్యం చేశాడని తెలుస్తోంది. ఈ విషయమై నిఖిత అతడిని పదే పదే డబ్బులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. పోలీసుల విచారణలో మరో షాకింగ్ అంశం బయట పడింది. నిఖిత ఖాతా నుంచి 3,500 డాలర్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న అర్జున్ శర్మ, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి దారి తీసిందని ప్రాథమికంగా తేలింది.డిసెంబర్ 31న డబ్బులు ఇస్తానని చెప్పి నిఖితను తన అపార్ట్‌ మెంట్‌కు పిలిపించిన అర్జున్ శర్మ, అక్కడే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వెంటనే అర్జున్ శర్మ అమెరికా నుంచి పారిపోయి భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు.ఈ ఘటనపై నిఖిత తండ్రి ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “అర్జున్ శర్మ మా అమ్మాయి స్నేహితుడు మాత్రమే. మాజీ ప్రియుడు అని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తానని పిలిపించి మా కూతురిని అతని అపార్ట్‌మెంట్‌లో హత్య చేశాడు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు,” అని ఆయన కన్నీళ్లతో చెప్పారు.డిసెంబర్ 31న నిఖిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హోవార్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జనవరి 2న నిఖిత ఆచూకీని గుర్తించినట్టు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మ కొలంబియా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తేలింది.హత్య అనంతరం భారత్‌కు పారిపోయిన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకు న్నట్టు సమాచారం. ఈ కేసులో అమెరికా, భారత అధికారుల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. నిఖిత హత్య జరిగిన విషయాన్ని భారత రాయబారి కార్యాలయం కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియ జేసింది. నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తండ్రి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. నిఖిత హత్యకు పాల్పడిన అర్జున్ శర్మకు అమెరికా ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.

మండలిలో కవిత కన్నీళ్లు...అవినీతిని ప్రశ్నించినందున సస్పెండ్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించానని పేర్కొన్నారు. అయితే పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను దారుణంగా అవమానించి బయటకు పంపారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “2004లో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చాను. 2006లో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. 2013–14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటారని పిలుపు రావడంతో 2013లో కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు నెలలు గడిచినా కాంగ్రెస్ పెద్ద నాయకుల్లో ఎవరూ మమ్మల్ని పలకరించలేదు. అటువంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో ఉన్న పరిచయం వల్ల కేసీఆర్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగలిగాను. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడంతో తెలంగాణ సాధన ముందుకు సాగింది” అని కవిత తెలిపారు. 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలుకు పంపించినా పార్టీ ఆదుకోలేదని కవిత విమర్శించారు. “అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల వరకు అన్నిచోట్లా అవినీతి జరిగింది. సిద్ధిపేట, సిరిసిల్ల నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీ వేదికల్లో ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం నాకే ఉంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్‌లో పెద్ద నాయకులమని చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లను మీడియాకు వెల్లడించాను” అని కవిత తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, పార్టీ పేరు మార్పు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. “తెలంగాణలో ఏం సాధించామో చెప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని చెప్పడం సరైంది కాదు” అంటూ కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కోనసీమలో బ్లో ఔట్.. వణికిపోతున్న జనం

కోనసీమలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ లేజీజ్ సంభవించింది. భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో   కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు.  మూడు దశాబ్దాల కిందటి బ్లో ఔట్ ను తలచుకుని ఆందోళనకు గురౌతున్నారు.  సరిగ్గా 30 ఏళ్ల కిందట.. అంటే 1995 జనవరి 8న ఇదే కోనసీమలో సంభవించిన భారీ బ్లో ఔట్ ను గుర్తు తెచ్చుకుని వణికి పోతున్నారు. అప్పట్లో  కోనసీమ లోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం వద్ద ఓఎన్జీసీ రిగ్గు లీకై భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.  ఆ మంటల ధాటికి ఆ పరిసర ప్రాంతాల్లోని పచ్చదనమంతా మాడి మసైపోయింది. కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. జనవరి 8న జరిగిన ఆ బ్లోఔన్ మార్చి 15 నాటికి కానీ అదుపులోకి రాలేదు. అప్పట్లో సంభవించిన ఆ బ్లో ఔట్ ప్రపంచ బ్లో ఔట్ ల చరిత్రలోనే రెండో అతి పెద్ద బ్లో ఔట్ గా చరిత్ర సృష్టించింది. ఆ బ్లో ఔట్ కారణంగా భారీ నష్టం సంభవించింది. దాదాపు రెండు నెలలకు పైగా  ఆ మంటల వేడికి పాశర్లపూడి పరిసర గ్రామాల ప్రజలు మగ్గిపోయారు. పొలాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భారీగా ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో కోనసీమ వాసులు నాటి రోజులను జ్ణప్తికి తెచ్చుకుని భయంతో వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ లీకేజీని అరికట్టి మంటలను ఆర్పివేయాలని కోరుతున్నారు. 

మైనర్ల సహజీవనం!

ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న ఉదంతం హైదరాబాద్ లో  కలకలం సృష్టించింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేయడం  కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు  చెందిన మైనర్లైన అబ్బాయి, అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఆ ఇద్దరినీ మందలించి.. కౌన్సెలింగ్ చేసి..  ముందు చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ తరువాత తామే వారిరువురికీ వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా   హైదరాబాద్‌ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో  ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో  వీరి వ్యవహారం  వెలుగులోకి వచ్చింది. పోలీసులు  రంగం లోకి దిగి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరూ మైనర్లు కావడంతో..   నిబంధనల మేరకు వారిని శిశువిహార్‌కు తరలించారు. బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని, మైనర్ల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు మైనర్ల సహజీవనం ఉదంతం నగరంలో కలకలం రేపింది.   తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని  మానసిక నిపుణులు అంటున్నారు.