టీమ్ వర్క్...బెటర్ రిజల్ట్స్...ఇవే అభివృద్ధి మంత్రం : సీఎం చంద్రబాబు
2025వ సంవత్సరంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026లోనూ అదే ఉత్సాహం, వేగంతో పనిచేసి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
ఈ సమావేశంలో మొత్తం 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.8,74,705 కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా, 8,35,675 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
సమావేశం ప్రారంభానికి ముందు మంత్రులు, సీఎస్ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తిరిగి బలపడిందని, గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చిన్న పొరపాటుకైనా తావివ్వకుండా బాధ్యతతో పనిచేయాలని మంత్రులు, అధికారులను కోరారు.
ప్రజలపై భారం తగ్గించాం… సంతోషంగా ఉంది
విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టామని సీఎం తెలిపారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, రూ.4,500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ చర్యల వల్లే డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు.
దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయగలిగామని, గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి రావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం ప్రశంసించారు. వేగవంతమైన గవర్నెన్స్‌తో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఐలాండ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. 15 కిలోమీటర్ల క్లీన్ బీచ్ ఫ్రంట్, కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, మాల్దీవ్స్ తరహాలో ఐలాండ్ టూరిజాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పాపికొండలు–పోలవరం, కోనసీమ, పులికాట్, విశాఖ, అరకు, గండికోట వంటి ప్రాంతాలను క్లస్టర్ టూరిజంగా అభివృద్ధి చేయాలని తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతులకు లాభం
తిరుపతి ప్రాంతంలో మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. వాల్యూ అడిషన్‌తోనే రైతులకు గరిష్ట లాభం దక్కుతుందన్నారు. ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఛాంపియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పాలసీల అమల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవద్దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, స్పేస్ సిటీ, మాకవరపాలెం ఫుడ్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏపీ ఐటీ ఇన్‌ఫ్రా పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు, సీఎస్ విజయానంద్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.