బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

బంగ్లాదేశ్, ఇండియా మధ్య సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక ఆందోళనల ప్రభావం ఇరు దేశాల మధ్యా దౌత్య సంబంధాలనే కాకుండా అన్ని రంగాలపైనా కూడా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలపై కూడా పడింది.  బంగ్లాదేశ్ స్టార్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు  కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆల్లర్ల కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. 

ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాకాండ, హిందూ వ్యతిరేకత బాగా పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. బంగ్లాలో పెచ్చరిల్లుతున్న భారత వ్యతిరేకత కారణంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  ముస్తాఫిజూర్ ను ఐపీఎల్ నుంచి తొల‌గించాల‌ని నిర్ణయించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముస్తాఫిజుర్ ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది. ఆ జట్టులో ముస్తాఫిజుర్ కీలక ఆటగాడిగా రాణిస్తాడని ఆ జట్టు భావించింది.

అయితే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అతడిని ఐపీఎల్ నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అకారణంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను బాధించిందని పేర్కొన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. అందుకు ప్రతిగా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.   

హస్తినలో కూల్చివేతలు.. ఉద్రిక్తత

దేశ రాజధాని నగరంలో కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. పాత ఢిల్లీలోని టర్క్ మాన్ గేట్  సమీపంలోని ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  చేపట్టిన కూల్చివేతల పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో బాష్ఫవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.   ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు, శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న   38 వేల 940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది  నవంబర్‌లో  ఆదేశాలు జారీ చేసింది.  దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో  అధికారులు భారీగా పోలీసులు మోహరించి  17 బుల్డోజర్లతో కూల్చివేతల చేపట్టారు.  

కొవ్వూరు ఫ్లై ఓవర్ పై బస్సు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ  ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై జరిగింది.  ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో  షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.   బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దింపివేయడంతో  పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన సమయంలో బస్సులో   ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.   సమాచారం అందుకున్న   స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.  

రేపు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు

  రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు  రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నేరుగా హెలికాప్టర్‌లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు.  88 శాతం పూర్తయిన ప్రాజెక్టు నిర్మాణం  గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014-19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.  

జ‌న‌వ‌రి 9 నుండి ఆన్ లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు

  భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.  అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంది.అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు : లోకేష్

  సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 – కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డిపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్ – ఫ్రెష్ స్పీచ్ & ప్రైవసీ లపై చర్చించారు.  మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తాం, ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించం. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ ను అరికట్టాలి, నిర్ణీత వయసు ఆధారిత సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలి. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలి. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు, అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్ గా దురుద్దేశపూర్వక పోస్టులు పెడుతున్నారు.  దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించం. ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. గతంలో జ్యుడీషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారు. విదేశాల్లో ఉండి అభ్యంతర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తాం. ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టుల కట్టడికి కేంద్రప్రభుత్వం సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ప్రవేశపెట్టింది.  మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు చేస్తే మా పార్టీ వాడైనా జైలుకు పంపించాం. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్ మీడియాలో సెకన్ల వ్యవధిలో కంటెంట్ స్ప్రెడ్ అవుతోంది. ఫలితంగా వెనువెంటనే ప్రభావం చూపుతుంది. కాంట్రవర్సీ ఎక్కువగా జనంలోకి వెళుతోంది. ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా పెట్టాలి. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేయాలి.  ఆస్ట్రేలియా, ఈయూ, యూకేలలో ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ అమలు చేస్తూ హెవీ పెనాలిటీస్ విధిస్తున్నారని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ... సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసు నమోదు, చార్జిషీటుకు సమయం పడుతోంది. సైబర్ క్రైమ్ కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన  అవసరం ఉంది. నెలరోజుల్లో చార్జిషీటు ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలి. అటువంటి వ్యక్తుల సోషల్ మీడియా ఎకౌంట్లను సస్పెండ్ చేయడంపై దృష్టిపెట్టాలి. రిటైర్డ్ జడ్జిలు, న్యాయకోవిదుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో  మంత్రి కొలుసు పార్థసారధి, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్, కుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లుప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదు : బీటెక్ రవి

  వివేకా హత్యను గుండెపోటు, బ్లడ్ వాంతులుగా చిత్రీకరించి సాక్ష్యాలను మాయం చేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి చూపించిన తెలివి సామాన్యమైనది కాదని, అంత క్రిమినల్ బుర్ర తనకు లేదని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి విమర్శించారు. మంగళవారం కడపలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ వివేకాని మీరే హత్య చేసి మాపై నిందలు వేయాలనుకోవడంలో అవినాష్ రెడ్డికి ఉన్నంత తెలివి తమకు లేదన్నారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు వస్తే తల్లిని అడ్డుపెట్టుకుని ఆస్పత్రిలో నాటకాలు ఆడిన స్థాయి బుద్ధి తమకు లేదని ఎద్దేవా చేశారు.తాను ఏదో మాట్లాడితే సంబంధం లేని విషయాలు అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. హౌసింగ్ విషయంలో తనకు బుర్ర ఉందా లేదా అని ప్రశ్నిస్తున్న అవినాష్ రెడ్డి, నిజంగా బుర్ర ఉంటే మాట్లాడుతున్నాడా అని కౌంటర్ ఇచ్చారు. పులివెందుల హౌసింగ్ ప్రాజెక్టుల్లో 10 శాతం అదనంగా డబ్బులు డ్రా చేశామని వాళ్లే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. హౌసింగ్ లబ్ధిదారులు కట్టిన డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారు? తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇస్తాడా లేక అవినాష్ రెడ్డే ఇస్తాడా అని ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, మట్కా విషయంలో మీ పాలనలో పులివెందుల రెండో తాడిపత్రిగా మారిందన్నది నిజం కాదా అని నిలదీశారు.వినాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీటెక్ రవి సూచించారు.

జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు : మంత్రి సవిత

  గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. మాజీ సీఎం జగన్ మానసిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందని, ఆయనకు లండన్ మందులు పని చేయనట్లుందని అన్నారు. వైయస్సార్ కడప జిల్లా వీరపునాయుని పల్లె ఉల్లి రైతులకు నష్ట పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఏపీని తానే అభివృద్ధి చేసినట్లు జగన్  భ్రమలో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు.  భోగాపురం ఎయిర్ పోర్టు తానే నిర్మించానని, విశాఖకు డెటా సెంటర్ ను కూడా తెచ్చింది ఆయనేనని జగన్  చెప్పుకోవడం ఆయన దిగజారిన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుదేనన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం జగనేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఆయన అసమర్థత వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు.   *జగన్ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు రైతుల పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వేరాళ్లపైనా జగన్ తన బొమ్మను ముద్రించుకుని రైతులను, భూ యజమానులు భయబ్రాంతులకు గురిచేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు.  పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ బొమ్మను తొలగించి, రాజముద్ర వేసి రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించామన్నారు. రైతులకు తమ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించామన్నారు. అయిదేళ్లలో జగన్ అయిదు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి యూనిట్ పై 13 పైసల చొప్పున్న ట్రూ అప్ ఛార్జీలు తగ్గించిందన్నారు.

హైకోర్టుకు రకుల్ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్

  హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు...ఈ నేపథ్యంలోనే పోలీసులు మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించగా అందులో హీరోయిన్ సోదరుడు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అమన్‌ను ఏ7 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసు నమోదు అయిన నాటి నుంచి  అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారుడిగా (డ్రగ్స్ కన్స్యూమర్) అమన్‌పై ఆరోపణలు ఉన్నాయి.  ఇదే కాకుండా, ఇది అమన్‌పై నమోదైన రెండో డ్రగ్స్ కేసు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మరోవైపు అమన్ ప్రీతిసింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీతిసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చారని, ప్రత్యక్ష ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అమన్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.కేవలం ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.  అంతేకాకుండా,  తాను  డ్రగ్స్ కన్స్యూమర్ అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని అమన్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో కీలక అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుం టున్న నేపథ్యంలో, సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి డ్రగ్స్ కేసులో చిక్కుకు న్నాడని  తెలియడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

మరోసారి లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్...తప్పుడు రాతలపై పరువునష్టం దావా

  జగన్ మీడియా తప్పుడు రాతలపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ 7వ తేదీన (బుధవారం) హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్స్‌ పూర్తికాగా, 3వ సారి లోకేష్‌ హాజరవుతున్నారు. చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` శీర్షికతో 2019, అక్టోబర్‌ 22న జగన్ మీడియాలో అసత్యాలు, కల్పితాలతో ఓ కథనం ప్రచురించారు. అవాస్తవాలతో, ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఈ కథనం ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన న్యాయవాదుల ద్వారా  ఆపత్రికకి రిజిస్టర్‌ నోటీసు పంపించారు.  అయినప్పటికీ జగన్ మీడియా  ఎటువంటి సహేతుకమైన సమాధానం ఇవ్వనందున  లోకేష్‌ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం ప్రచురించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని  ప్రచురించిన తేదీల్లో అసలు విశాఖలోనే లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్‌ పోర్ట్‌లో ఎటువంటి ప్రొటోకాల్‌ సౌకర్యాలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి లోకేష్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు, ఎస్వీ రమణ హాజరవుతున్నారు.

టీమ్ వర్క్...బెటర్ రిజల్ట్స్...ఇవే అభివృద్ధి మంత్రం : సీఎం చంద్రబాబు

  2025వ సంవత్సరంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026లోనూ అదే ఉత్సాహం, వేగంతో పనిచేసి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.8,74,705 కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా, 8,35,675 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. సమావేశం ప్రారంభానికి ముందు మంత్రులు, సీఎస్ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తిరిగి బలపడిందని, గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చిన్న పొరపాటుకైనా తావివ్వకుండా బాధ్యతతో పనిచేయాలని మంత్రులు, అధికారులను కోరారు. ప్రజలపై భారం తగ్గించాం… సంతోషంగా ఉంది విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టామని సీఎం తెలిపారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, రూ.4,500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ చర్యల వల్లే డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయగలిగామని, గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి రావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం ప్రశంసించారు. వేగవంతమైన గవర్నెన్స్‌తో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఐలాండ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. 15 కిలోమీటర్ల క్లీన్ బీచ్ ఫ్రంట్, కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, మాల్దీవ్స్ తరహాలో ఐలాండ్ టూరిజాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పాపికొండలు–పోలవరం, కోనసీమ, పులికాట్, విశాఖ, అరకు, గండికోట వంటి ప్రాంతాలను క్లస్టర్ టూరిజంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతులకు లాభం తిరుపతి ప్రాంతంలో మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. వాల్యూ అడిషన్‌తోనే రైతులకు గరిష్ట లాభం దక్కుతుందన్నారు. ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఛాంపియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలసీల అమల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవద్దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, స్పేస్ సిటీ, మాకవరపాలెం ఫుడ్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏపీ ఐటీ ఇన్‌ఫ్రా పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు, సీఎస్ విజయానంద్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.