ఫామ్ హౌస్ కేసు.. బీఆర్ఎస్ అనుకున్నదొకటి.. అయినది మరొకటి
posted on Dec 27, 2022 @ 11:35AM
ఫామ్ హౌస్ కేసు విషయంలో అనుకున్నదొకటి.. అయినది ఒకటి అన్నట్లుగా తయారైంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. కేసీఆర్ అత్యుత్సాహం.. పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని పార్టీవర్గాలే గుసగుస లాడుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రాలకు లేవా అంటూ ఈ కేసు దర్యాప్తునకు సీట్ ను ఏర్పాటు చేసినప్పుడు పార్టీ క్యాడర్ లో, పార్టీ మారాలంటూ తమను ప్రలోభ పెట్టారంటూ ఫిర్యాదు చేసిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపించిన ధీమా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
ఇందుకు ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాభరా, కంగారూ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ట్రాప్ జరిగిన సమయంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు జరిగిన ప్రచారమే కానీ, అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదు. నిజంగా అప్పట్లో సొమ్ము బయటపడి ఉంటే.. ఈడీ ఈ పాటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించేసి ఉండేది. అయితే ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అప్పట్లో సొమ్ము రికవరీ చూపలేదన్న వాదన కూడా ఉంది.
అయితే ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఆ వెను వెంటనే హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగుతోంది. దీంతో ఈ కేసు విషయంలో ఒక తార్కిక ముగింపునకు ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా వ్యక్తమౌతోంది. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల స్కాన్ లోనే ఉంటారు.
ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి, ఎలా ట్రాప్ చేశారు, సొమ్ముల సమీకరణ ఎలా వరకూ అన్ని అంశాలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలుగులోనికి తీసుకు వస్తాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సిట్ వైపు నుంచి మాత్రమే వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సిట్ ఇంత వరకూ చేసిన దర్యాప్తు, వెల్లడించిన విషయాలూ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఇక సిట్ కు లేదు. సో.. ఆ దర్యాప్తును అంతా పక్కన పెట్టేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు.
ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు.
రెండు సందర్భాలలోనూ ఆయనలో ఆందోళన, గాభరా స్పష్టంగా కనిపించింది. మీడియా ముందుకు రాలేదు కనుక మిగిలిన ముగ్గురూ ఎలా ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలియడం లేదు.. కానీ ఈ ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో మొదటి నుంచీ క్రియాశీలంగా ఉన్నదీ, కీలకంగా వ్యవహరించినదీ పైలట్ రోహిత్ రెడ్డే. ఈడీ విచారణ అనంతరం తనపై కేసులు నమోదౌతాయనీ, అరెస్టు చేస్తారనీ అనుమానం వ్యక్తం చేసిన ఆయన నందకుమార్ ఫిర్యాదు మేరకే తనపై కేసులు పెడతారన్నారు. అయినా ఫామ్ హౌస్ లో డబ్బుల చెలామణియే జరగలేదనీ, అలాంటప్పుడు కేసులు ఎలా పెడతారనీ కూడా ప్రశ్నించారు.
అసలు వాస్తవానికి రోహిత్ రెడ్డి నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు తనను ప్రలోభపెట్టారనీ, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని ప్రతిపాదించారనీ ఆరోపించారు. ఇంతకీ ఈ నందకుమార్ స్వయంగా రోహిత్ రెడ్డికి పార్టనర్. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ కేసులో ఇంత వరకూ బయటపడని మరింత లోతైన వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడౌతాయని పరిశీలకులు అంటున్నారు. అలా వెల్లడౌతాయన్నకంగారు రోహిత్ రెడ్డి మాటల్లో బయటపడుతోందనీ అంటున్నారు. మొత్తం మీద సిట్ దర్యాప్తు తో బీఆర్ఎస్ నేతల్లో కనిపించివన ధీమా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోనికి దిగనుండటంతో ఆవిరైపోయినట్లే ఉంది.