కొవిడ్ ప్రమాదం పొంచే వుంది తస్మాత్ జాగ్రత్త
posted on Dec 27, 2022 @ 10:49AM
చైనా, జపాన్ సహా పలు ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు, మనం భయపడవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అటు వైద్య రంగ నిపుణులు, అధికారులు భావిచారు. కానీ, తాజా పరిణామాలను గమనిస్తే, కేవలం అప్రమత్తత సరిపోదని, తగిన ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలు అనివార్యమయ్యే పరిస్థితి తప్పదని అంటున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులతో కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అలాగే నూతన వేడుకల్లో తగిన జాగ్రత్తలు అవసరమని అంటునారు.
ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.అలాగే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం(డిసెంబర్ 27) మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మరోవంక విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరి చేసింది. అలాగే విమానాశ్రయాల్లో వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసులు విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వారి కాంటాక్టులను ట్రేస్ చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రాధాన్యతన ఇస్తున్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడిక్కడ, ఎప్పటికప్పడు అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి.
ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్ పరీక్షలు చేస్తుండటంతో పలువురికి పాజిటివ్‌గా తేలుతోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 మందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 24న 2867మందికి పరీక్షలు చేయగా.. వారిలో 12మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు కర్ణాటక ఆరోగ్యమంత్రి సుధాకర్ వెల్లడించారు.
బిహార్‌లోని గయ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మయన్మార్ నుంచి రాగా.. ఒకరు బ్యాంకాక్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారందరిలోనూ లక్షణాల్లేవని.. ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం చైనా నుంచి దిల్లీ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 సోకిన విషయం తెలిసిందే. అయితే, అతడిని దిల్లీ నుంచి ఆగ్రాకు తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను అధికారులు గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. అతడితో కాంటాక్టు అయిన 27మందిని గుర్తించి వారి నమూనాలను సేకరించారు.
అలాగే, కోల్‌కతా విమానాశ్రయంలో రెండు కొవిడ్ కేసుల్ని గుర్తించారు. వీరిలో ఒకరు దుబాయి నుంచి డిసెంబర్ 24న రాగా.. మరొకరు మలేషియాలోని కౌలాలాంపూర్ నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇద్దరి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపినట్టు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వస్తున్న వారితో ముప్పు పొంచి ఉందని గుర్తించిన అధికారులు విమానాశ్రయాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరి చేశారు.
మరోవంక నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్‌లు, రెస్టారంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. కరోనా వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, సీఎస్ జవహార్ రెడ్డి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆస్పత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్టు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు.. అన్ని రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆయన ప్రజలను కోరారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది, అధికారులు, న్యాయవాదులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్కు ధరించిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.కాగా
దేశంలో సోమవారం(డిసెంబర్ 26) దేశ వ్యాప్తంగా 35,173 టెస్టులు చేశారు.198 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3428కి చేరింది. నిన్న 190మంది కోలుకోవడంతో ప్రస్తుతం రికవరీ రేటు 98.8శాతంగా ఉందని అధికారులు తెలిపారు.