కమలం నేతలను కారెక్కిస్తున్న హరీష్.. రేవంత్ రెడ్డిపైనే ఈటల ఆశలు!
posted on Oct 9, 2021 @ 11:59AM
తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టం ముగిసింది, నామినేషన్లు ముగియడంతో ప్రధాన పోటీదారులెవరన్నది తేలిపోయింది. నామినేషన్లు ముగియడంతో అంతా ప్రచారంపై ఫోకస్ చేశారు. అక్టోబర్ ముప్పైన జరగనున్న పోలింగ్ కోసం శ్రమిస్తున్నారు. అయితే అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో రోజురోజుకు పార్టీల బలాబలాలు మారుతున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్, ఆయన డైరెక్షన్ లోనే ప్రచారం సాగుతోంది, ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావుకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి. దీంతో హరీష్ తో పాటు ముగ్గురు మంత్రులు దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు హుజురాబాద్ లోనే మకాం వేశారు, ప్రచారం నిర్వహిస్తూనే ఈటల రాజేందర్ కు మద్దతుగా ఉన్న నేతలపై ఫోకస్ చేశారు గులాబీ లీడర్లు, మంత్రి హరీష్ రావు స్వయంగా వాళ్లతో మాట్లాడుతూ తన వైపునకు తిప్పుకుంటున్నారు, హరీష్ ఎత్తులతో రోజుకో ఈటల అనుచరుడు కారెక్కేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ లో ఉండి ప్రస్తుతం రాజేందర్ వెంట నేతలతో పాటు స్థానిక బీజేపీ నేతలను కూడా తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నారు హరీష్ రావు.
ఈటల వెంట ఉన్న నేతలకు భారీగా నజరానాలు ముట్టజెప్పుతున్నారట టీఆర్ఎస్ లీడర్లు, వాళ్ల స్థాయిలను బట్టి వేల నుంచి లక్షల వరకు ముట్టజెప్పుతున్నారట. వార్డు స్థాయి లీడర్ కు ఒక రేటు... గ్రామస్తాయి లీడర్ కు మరో రేటు ఇస్తున్నారట. మండలస్థాయి నాయకుడైతే 10 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నారట కారు పార్టీ నేతలు. మంత్రి హరీష్ రావే స్వయంగా వాళ్లతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు, ఇక కుల సంఘాల లీడర్లు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు వల వేస్తున్నారట. హరీష్ డైరెక్షన్ లోనే జరుగుతున్న ఈ ఎత్తులు ఫలిస్తున్నాయని, ఈటల రాజేందర్ వెంట ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఈటల అనుచరులలో మెజార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేలా హరీష్ రావు ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం, గ్రామ స్థాయిలో బీజేపీకి బూత్ మేనేజ్ మెంట్ లేకుండా చేయడమే హరీష్ రావు వ్యూహమంటున్నారు.
హుజురాబాద్ పై తాజాగా వెలువడుతున్న సర్వేల్లోనూ టీఆర్ఎస్ క్రమంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు ఈటలకు నియోజకవర్గంలో దాదాపు 80 శాతం మద్దతు కనిపించగా.. ప్రస్తుతానికి అది 45 శాతానికి పడిపోయిందని అంటున్నారు. జూలైలో 15 శాతం దగ్గరే ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు 40 శాతాన్ని క్రాస్ చేసింది, రోజురోజుకు ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు రాజేందర్ ఆశలన్ని కాంగ్రెస్ పైనే ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ బలంగా పోరాడితే,, ఈటల ఓడిపోయి టీఆర్ఎస్ గెలవడం ఖాయమంటున్నారు. కారును ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేసి.. మొక్కుబడిగా ప్రచారం చేస్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం ఈటలకు పడవచ్చు, అది జరిగేేతేనే ఈటలకు ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. బీజేపీ కూడా తమకు బద్ద వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ ను ఓడించడమే తమకు ముఖ్యమనే భావనలో రేవంత్ ఉన్నారని అంటున్నారు. అందుకే స్థానికేతరుడైన వెంకట్ ను బరిలోకి దింపారంటున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీల పోటాపోటీ వ్యుహాలతో హుజురాబాద్ ఉప ఎన్నిక రంజుగా మారుతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. పోలింగ్ నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో ఊహించడం కూడ కష్టంగా ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.