తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... విఐపి బ్రేక్ దర్శన టికెట్ల పునరుద్దరణ
posted on May 21, 2024 @ 3:23PM
ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీటీ తిరిగి ప్రారంభించింది. సోమవారం నుంచి సిఫార్సు లేఖల మీద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూకడుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాసరే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీకి టీటీడీ అభ్యర్థించింది. దీంతో టీటీడీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది.
దీంతో మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ. 300 ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు. ఈ సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం పట్టనుంది.
అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల కలకలం
అలిపిరి మెట్ల మార్గంలో సోమవారం రెండు చిరుతలు భక్తులు చూసి కేకలు వేశారు. దీంతో చిరుతలు అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటలు పట్టింది. 36,146 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.4.40 కోట్లు. భక్తులు వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు నిడిపోయి ఏటీసీ వద్ద వరకూ క్యూలైన్ లో వేచిఉన్నారు.