ఏపీ సర్కార్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు
posted on May 20, 2021 @ 2:02PM
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై ఫిర్యాదు అందింది. రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు కుటుంబ సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిసారు. రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఏపీ సీఐడీ చర్యలను, కోర్టు ధిక్కారాన్ని ఓం బిర్లాకు వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారని ఓం బిర్లాకు వివరించారు.
సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేశారని రఘురామ కుటుంబసభ్యులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాఘురామకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని కోరారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం
ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుమార్తె ఇందూ ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తమ తండ్రిని వేధిస్తున్నారని, కక్ష సాధించేందుకే అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో సీఐడీ పోలీసులు తమ తండ్రిని హింసించారని వాళ్లు అమిత్ షాకు చెప్పారని తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తూ జైలుకు పంపారన్నారు. సీఎం వైఎస్ జగన్ బెయిలు రద్దు చే యాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ముఖ్యమంత్రి కక్ష కట్టి తమ తండ్రిపై కుట్రపూరితంగా రాజద్రోహం కేసు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. రఘురామ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలన్నీ సావధానంగా విన్నఅమిత్‌షా... అసలేం జరిగిందో, ఎందుకు ఇలా చేస్తున్నారో రాష్ట్రం నుంచి వివరణ కోరుతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.