విశాఖ ఉక్కు తరువాత ఇక నెక్స్ట్ టార్గెట్ టీటీడీనే.. మాజీ ఎంపీ సంచలనం
posted on Feb 12, 2021 @ 4:50PM
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేయడం పై ఏపీలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతన్న సంగతి తెల్సిందే. తాజాగా ఇదే వరుసలో టిటిడిని కూడా తమ అదుపులోకి తెచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత చింత మోహన్ సంచలన ఆరోపణలు చేసారు . టీటీడీ ఆధీనంలో ఉన్న రూ.10వేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల ఆస్తులపై ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ కన్నేశాయని అయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన రహస్య సమావేశం జరిగిందని, ప్రధానంగా టీటీడీని తమ చేతుల్లోకి ఎలా తీసుకోవాలన్న దానిపై లీగల్ సలహా తీసుకున్నట్లు తనకు తెలిసిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలాగైతే ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో అదేవిధంగా టీటీడీని కూడా ధారాదత్తం చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కుట్రను ఖండిస్తున్నానని, రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని చింతా మోహన్ పిలుపునిచ్చారు.