వైసీపీలోకి గంటా! కలిసిన ఉప్పు నిప్పు..
posted on Feb 12, 2021 @ 4:57PM
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తానని ప్రకటించారు. అయితే గంటా రాజీనామాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. చాలా కాలంగా అధికార వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న గంటా.. ఇప్పుడు ఇలా లైన్ క్లియర్ చేసుకున్నారనే గుసగుసలు వినిపించాయి. గంటాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ తో ఆయనకు పొసగదని.. గంటా వైసీపీలో చేరకపోవచ్చని కొందరు వాదించారు. అయితే తాజాగా విశాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప్ప నిప్పుగా ఉన్న మంత్రి అవంతి - మాజీ మంత్రి గంటాలను విశాఖ ఉక్కు ఉద్యమం ఒకే వేదికపైకి తెచ్చింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనకుంటున్న కేంద్రం తీరుకు నిరసనగా అఖిలపక్షం ఆద్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారా దీక్షలకు ఇద్దరు నేతలు వచ్చారు.. ఒకరిని చూసి ఒకరు నవ్వుకుని పలకరించుకున్నారు... సీపీఐ నారాయణ అక్కడే ఉండి ఏవో సెటైర్లు వేయడంతో ఇద్దరు హ్యాపీగా నవ్వుకున్నారు. చాలా సేపు మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస రావు కలిసే ఉన్నారు.
తాజా పరిణామంతో గంటా శ్రీనివాస రావు త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
గంటా- అవంతి ఒకప్పుడు మంచి మిత్రులు. ప్రజారాజ్యం, టీడీపీలో చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. 2019 ఎన్నికలు వీరిద్దరినీ విడదీశాయి. భీమిలీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలన్న వివాదం పెద్దదిగా మారి ఇద్దరి మధ్య గ్యాప్ పెంచింది. తరువాత ఇద్దరూ బద్ద శత్రువులుగా మారారు. ఎన్నికలకు ముందు అవంతి వైసీపీలోకి వెళ్లగా.. గంటా టీడీపీలోనే ఉన్నారు.. అవంతి సైకిల్ దిగి వైసీపీ కండువా కప్పుకుని భీమిలి నుంచి పోటీ చేస్తే.. గంటా తన ఆనవాయతీని కొనసాగిస్తూ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇద్దరు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అవంతి మంత్రి అయ్యారు.. గంటా వేరే పార్టీలో చేరే ప్రయత్నాల్లోనే ఉండిపోయారు
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే అవంతి మాత్రం గంటాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ కాక రేపారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.. సమయం దొరికిన ప్రతిసారి మంత్రి అవంతి.. గంటాపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. గంటా మాత్రం మౌనం వహిస్తూ వచ్చారు. ఇటీవల విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తారనే వార్తలతో గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు.తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.విశాఖ ఉక్కును కాపాడుకోడానికి అంతా రాజీనామాలు చేయాలని పిలుపు ఇచ్చారు. తాజాగా విశాఖ ఉద్యమం ఈ ఇద్దరు పాత మిత్రులను మళ్లీ కలిసింది.