జూన్ 2న ఈటల రాజీనామా! కేంద్ర మంత్రివర్గంలో చోటు?
posted on May 30, 2021 @ 9:39PM
కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజులుగా జరుగుతున్నట్లే ఆయన కమలం గూటికి చేరబోతున్నారు. కేంద్ర సర్కార్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్.. సోమవారం ఉదయం11 గంటలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి బీజేపీ నేత బండి సంజయ్ వెళ్లనున్నారు. ఈటలను నడ్డా దగ్గరకు బండి సంజయ్ తీసుకెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా ఈటల కలిసే అవకాశం ఉంది. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
తనను కేబినెట్ నుంచి తొలగించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకోవాలనే కసిలో ఉన్నారు. బీసీ ఎజెండాతో ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. బీసీ సంఘాలకు కూడా ఆయనకు మద్దతుగా నిలిచాయి. తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించిన ఈటల కూడా అదే సంకేతమిచ్చారు. సోషల్ మీడియాలోనూ కొత్త ప్రోఫైల్ పెట్టి కాక రాజేశారు. అయితే తర్వాత సీన్ మారింది. కొత్త పార్టీని పక్కనపెట్టిన ఈటల.. బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈటల బీజేపీలో చేరేలా డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి ఒప్పించారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ హైదరాబాద్ వచ్చి ఈటలతో మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆఫర్లపై తన మద్దతు దారులతో చర్చించిన రాజేందర్.. కషాయ కండువా కప్పుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
బీజేపీలో చేరిన అనంతరం.. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీనామా ప్రకటిస్తారని సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీచేయబోడని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలో ఈటల జమున పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆమె కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను రాజ్యసభకు పంపిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రం నుంచి అవకాశం లేనప్పటికి.. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి ఈటలను పెద్దల సభకు పంపిస్తారని సమాచారం. తర్వాత కేంద్రమంత్రి పదవి ఈటలకు ఇవ్వనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రితో తలపడేందుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
రెండు రోజుల క్రితం శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయన్ను కలిశారు. బీజేపీలో చేరవద్దని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారట. అయితే తనపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో.. వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర సర్కార్ అండగా అవసరం ఉంటుందని ఈటల భావించారని అభిప్రాయపడుతున్నారు.
ఇక భూకబ్జా వివాదంలో ఇంతకాలం ఈటల రాజేందర్కు కు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. ఇకపై వైఖరి మార్చుకునే అవకాశం ఉంది. ఈటల బీజేపీలో చేరితే ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయంపై బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. బీసీల ఆత్మగౌరవమని మాట్లాడిన ఈటల.. బీసీ వాయిస్ తో సొంత పార్టీ పెడతారని భావించామని.. కాని ఆయన తమను మోసం చేశారని కొందరు బీసీ నేతలు చెబుతున్నారు. ఆత్మగౌరవం కాదు ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని మరికొందరు నేతలు ఆరోపిస్తున్నారు.