బానిస భవన్ బద్దలు కొడతాం.. కాస్కో కేసీఆర్!
posted on Jun 4, 2021 @ 11:49AM
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచానని చెప్పారు. కేసీఆర్ కుమార్తెకు బీ-ఫారం ఇచ్చినా ఓడిపోయిందన్నారు. ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ఆదేశించినా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవలం ఏడుగురే. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని ఆయన అన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు' అని ఈటల రాజేందర్ తెలిపారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు.తనకు పదవులు త్రుణప్రాయమన్నారు. ఎన్నికల బరిలో దిగిన ప్రతిసారి.. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచివచ్చానని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఏమొచ్చిందని ఈటల ప్రశ్నించారు.
మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని... 19 ఏళ్లుగా టీఆర్ఎస్ లో ఉన్న తనను కూడా అగౌరవపరిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల మండిపడ్డారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్తే... గేటు వద్దే తనను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం నుంచే అవమానించడం ప్రారంభించారని... మంత్రినైన తనకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్... ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చని... అంతిమవిజయం ధర్మానిదేనన్నారు. తనను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న హరీశ్‌రావుకు కూడా అవమానం జరిగిందని ఈటల వివరించారు. ప్రగతి భవన్ బానిసల నిలయంగా మారిందని ఆరోపించారు. ఉద్యమంలో ఉన్నవారిని అణిచివేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఈటల విమర్శించారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ ల పార్టీల్లాంటిది టీఆర్ఎస్ కాదని... ఎంతో మంది ఉద్యమకారుల త్యాగఫలంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సీఎం ఎస్సీ అని చెప్పారు. సీఎంవో కార్యాలయంలో ఒక్క ఎస్సీనైనా, ఎస్టీనైనా ఉన్నారా? సీఎంవో కార్యాలయంలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీవోలు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రయోజనం కలిగించేలా అనేక సంఘాలు పెట్టించాం. బొగ్గు కార్మికులతో ఎలాంటి సంబంధం లేనివారు సంఘం నాయకులుగా ఉన్నారు. తెలంగాణ గడ్డమీద సంఘాలు, సమ్మెలు ఉండొద్దని కోరుకున్నారని ఈటల రాజేందర్ అన్నారు.సమ్మెలు చేసినా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటల చెప్పారు. ఆర్థిక మంత్రిగా తాను ఉన్నప్పుడు తాను చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ప్రజలు అహింసాయుతంగా నిరసన తెలిపే ధర్నాచౌక్ ను కూడా ఎత్తేసిన ఘనత కేసీఆర్ దని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని... అయితే, బెంజ్ కార్లలో తిరిగే వారికి కూడా రైతుబంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానని చెప్పారు. రైతుబంధును ఆదాయ పన్ను చెల్లించేవారికి ఇవ్వొద్దని చెప్పానని, వ్యవసాయం చేయనివారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. పొలం సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తే పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనే స్థాయి రైస్ మిల్లర్లకు లేదని, రాదని అన్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం తన తప్పా? అని ప్రశ్నించారు.
మంత్రుల మీదే నమ్మకం లేని కేసీఆర్ కు... నాలుగు కోట్ల ప్రజలను పాలించే హక్కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. సమ్మెలు చేయకుండా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. తనది నక్సలైట్ అజెండా అని కేసీఆర్ చెప్పుకున్నారని... కానీ, వరవరరావును జైల్లో పెడితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఈటల విమర్శించారు