హుజురాబాద్‌లో దుబ్బాక రిపీట్? కేసీఆర్ పై ఈటల డైరెక్ట్ వార్..
posted on Jun 4, 2021 @ 1:46PM
అనుమానాలు, ఊహాగానాలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెర దించారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు రాజేందర్. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికతో హుజురాబాద్‌ను పోల్చి చూస్తున్నారు అంతా. ఆ రెండింటి మధ్య చాలా పోలికలే కనిపిస్తున్నాయి. దుబ్బాక అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన భార్య కారు గుర్తుపై బరిలో దిగింది. సానుభూతి ఓట్లతో గెలుపు చాలా ఈజీ అనుకున్నారు కేసీఆర్. కానీ, రఘునందన్‌రావు రూపంలో బీజేపీ దుమ్ము రేపుతుందని గులాబీ బాస్ అస్సలు ఊహించలేకపోయారు. హుజురాబాద్‌లోనూ దుబ్బాక తరహా పరిస్థితులే ఉన్నాయంటున్నారు.
దుబ్బాకలో రఘునందన్ లానే.. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ అనబడే బలమైన ఉద్యమ నేత పోటీలో ఉన్నారు. అతని వెనుక.. ఉద్యమకారులు, కమలదళం తోడుగా ఉంది. దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్‌రావుకు సహాయంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు బూత్ స్థాయిలో గ్రౌండ్ వర్క్ బాగా చేశాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను, పోలీసుల ఆగడాలను బీజేపీ కేడర్ బలంగా ఎదుర్కొంది. ఓ ఘటనలో రఘునందన్ కోసం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌లు రాత్రికి రాత్రే దుబ్బాక తరలివచ్చారు. బీజేపీ శ్రేణులంతా కలిసి రఘునందన్‌ను గెలిపించుకుని కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. సేమ్ టూ సేమ్.. హుజురాబాద్‌లోనూ అలానే జరిగే అవకాశం ఉందంటున్నారు కొందరు.
ఈటల రాజేందర్ కేసీఆర్‌కే సమ ఉజ్జీలాంటి నాయకుడు. హుజురాబాద్ ఈటల సొంత ఇలాకా. గ్రామగ్రామాన కేడర్ ఉన్న దమ్మున్న లీడర్. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా ఈటల అనుచరులే. కావలసినంత ఆర్థిక బలమూ ఆయన సొంతం. పైగా టీఆర్ఎస్ నుంచి అన్యాయంగా, దారుణంగా, అవమానకరంగా వెళ్లగొట్టారనే సానుభూతి కూడా ఉంది. ఇన్ని పాజిటివ్ అంశాలున్న ఈటలను హుజురాబాద్‌లో ఓడించాలంటే.. ఆయనకు వ్యతిరేకంగా స్వయంగా కేసీఆరే పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువేననేది ఈటల వర్గీయుల ధీమా.
అంత ఈజీగా ఓడిపోతే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? అనేవారూ ఉన్నారు. ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పుడే కేసీఆర్‌కు తెలుసు ఉప ఎన్నిక తప్పదని. అందుకే, డే వన్ నుంచే హుజురాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. మంత్రులు గంగుల కమలాకర్, హరీష్‌రావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈటల అనుచరులతో సమావేశాలు నిర్వహించి.. వారికి ప్రభుత్వ పరంగా ఆశలు చూపించి.. నయానో, భయానో.. టీఆర్ఎస్‌లోనే ఉంటామని వారితో ప్రకటనలు చేయించి.. ఈటలను డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న ఈటల వ్యతిరేక వర్గీయులనూ తమవైపునకు తిప్పుకునేలా పావులు కదుపుతున్నారు. ఆ దెబ్బకే ఆయన సొంతపార్టీ అనే ఆలోచన వదిలేసి.. కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు బీజేపీకి జై కొట్టారు. తాను సింగిల్‌గా పోరాడటంకంటే.. కమలదళంలో కలిసిపోతే.. దుబ్బాక మాదిరే.. హుజురాబాద్‌లోనూ బీజేపీ బలం, బలగంతో గులాబీ బాస్ వ్యూహాలకు చెక్ పెట్టొచ్చనేది ఈటల స్కెచ్‌లా కనిపిస్తోంది