కేసీఆర్ బాగోతం బయటపెట్టిన ఈటల
posted on Jun 4, 2021 @ 11:49AM
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సిఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. శుక్రవారం తన నివాసంలో మీడియా మాట్లాడిన ఈటల.. కేసిఆర్ బాగోతం మొత్తం బయటపెట్టేశారు. తనకు కేసిఆర్ మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో చెప్పారు. తనకు కేసిఆర్ కే కాకుండా హరీష్ రావుకు కూడా గ్యాప్ ఉందని, ఆయనను అనేకసార్లు అవమానించారని అన్నారు.
కేసీఆర్ తో తన గ్యాప్ ఎలా వచ్చిందో వివరించారు రాజేందర్. నేను, కరీంనగర్ నేతలంతా ఒక సమస్య మీద ప్రగతి భవన్ కు వచ్చినము.. టిఆర్ఎస్ లో 19 ఏండ్ల నుంచి ఉన్న. అన్నా అని కేసిఆర్ ను ప్రేమగా పిలిచే చనవు ఉంది నాకు. పెద్ద సమస్య కావడం, జిల్లా ప్రజా ప్రతినిధులందరం వెళ్తున్నం కాబట్టి అపాయింట్ మెంట్ తీసుకోకుండానే పోయినం. ఇంతమందిని కాదంటరా అనుకున్నం. కానీ అపాయింట్ మెంట్ లేదు కాబట్టి ప్రగతి భనవ్ కు రానీయలేదు. ఎంత అడిగనా కాదన్నారు.మరోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వచ్చినం. కానీ అప్పుడు కూడా కలవనీయలేదు. అపాయింట్ మెంట్ ఉన్నా ఎందుకు రానీయలేదో నాకు అర్థం కాలేదు. ఆ సమస్య గురించి కేసిఆర్ కు చెప్పుకునేందుకు మూడోసారి వచ్చినం. అప్పుడు అనిపించింది.. ఇంత ఉద్యమ సహచరుడిగా చనువున్నా.. ఇప్పుడు ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నారో అనుకున్నాను. అప్పటినుంచే ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవు. ఒక మంత్రి పదవి అంటే బానిస కంటే హీనంగా ఉంటదా అని నాకు అప్పుడు అనిపించింది. కుక్కిన పేనులా పడి ఉంటే ఉండాలి. ఆత్మగౌరవం చంపుకుని అక్కడ ఉండలేను అనుకున్నా.. అని ఈటల రాజేందర్ చెప్పారు.
మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్‌ను అడిగాను. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క బీసీ కానీ.. ఎస్సీ అధికారి ఉన్నారా? బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు? రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు అవమానాలు భరించా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి.. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారు అని ఈటల రాజేందర్ విమర్శించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవలం ఏడుగురే. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని ఆయన అన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు' అని ఈటల రాజేందర్ తెలిపారు.