హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఖర్చు రూ. 500 కోట్లు?
posted on Oct 31, 2021 @ 11:57AM
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. పోలింగ్ సరళిని బట్టి పార్టీలు తమకు వచ్చే ఓట్లపై అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకే పట్టం కట్టాయి. హుజురాబాద్ పై ఏడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగా... అందులో ఆరు సంస్థలు ఈటల రాజేందరే గెలుస్తారని ప్రకటించాయి. ఒక్క సర్వేలో మాత్రం కారుకు స్వల్ప లీడ్ వచ్చింది.పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు కమలనాధులు.
హుజురాబాద్ ఉప ఎన్నిక దక్షిణ భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికగా నిలిచిపోయిందని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసింది. దాదాపు మూడు నెలల నుంచే అధికార పార్టీ ప్రలోభాలకు దిగిందనే విమర్శలు ఉన్నాయి. ఈటల వెంట టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరూ వెళ్లకుండా వాళ్లకు పెద్ద మొత్తంలో నజరానాలు ఇచ్చిందనే ప్రచారం జరిగింది. ఇక పోలింగ్ మూడు రోజుల ముందే ఓటర్లకు కోట్లాది రూపాయలు పంపిణి చేసిందని తెలుస్తోంది. ఓటరుకు 6 వేల నుంచి 10 వేల రూపాయల వరకు అధికార పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత ఖర్చుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ,బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉప ఎన్నిక కోసం కేసీఆర్ భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని.. సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ఇంత భారీగా ఖర్చు చేసినా హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని కాపాడుకోవాలని భావించారన్నారు. వందలాది పోలీసుల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని.. చివరకు డ్రైవర్లు.. పీఏలను కూడా కోవర్టులుగా వాడుకొని నీచ రాజకీయాలు చేశారన్నారు.
హుజూరాబాద్ పరిస్థితిని అప్రకటిత ఎమర్జెన్సీగా మార్చిన వేళ.. దీనిపై ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఓటుతో చెప్పారన్నారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమన్న ఆయన.. 'హుజూరాబాద్ ప్రజలు చరిత్రను తిరగరాశారని చెప్పారు. కేసీఆర్ కుట్రల్ని అర్థం చేసుకున్నారంూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు రాజేందర్.