తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. నవంబర్ 29న పోలింగ్
posted on Oct 31, 2021 @ 11:57AM
తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేసింది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే కోటా మండలి స్థానాల ఎన్నిక కోసం నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16న నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 22న ఉపసంహరణ ఉండనుంది. నవంబర్ 29న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది.
తెలంగాణలో జూన్ 3న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో మహ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్వేశర్లు, కడియం శ్రీహరి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఏపీలో శాసనమండలి మాజీ చైర్మెన్ మహ్మద్ షరీఫ్, చిన గోవింద్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదవి కాలం ముగిసింది. అయితే కోవిడ్ కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా షెడ్యూల్ ఇచ్చింది.