ఎస్ఐపై వైసీపీ నేతల దౌర్జన్యం! జగనన్న.. ఇదేమి రాజ్యం?
posted on Oct 31, 2021 @ 10:38AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులు కామన్ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార దర్పంతో వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారు. తమను ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రతిపక్ష నేతలేనే కాదు.. తమకు సహకరించని ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లాలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. కత్తితో దాడి చేయడంతో ఎస్‌ఐ చేతికి గాయమైంది. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం వరకు కోడుమూరు ఎస్‌ఐగా పనిచేసిన వేణుగోపాల్ ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఇద్దరు సిబ్బందితో కలిసి వీఆర్ ఎస్‌ఐ వేణుగోపాల్ మఫ్టీలో వెళ్లి గోరంట్లలో అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేశారు. మద్యం దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టారు. ఇంతలో గోరంట్ల సర్పంచ్ అనుచరులు ఎస్‌ఐ వాహనాన్ని బైక్‌లతో అటకాయించారు. తాము సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులమని ఐడీ కార్డు చూపినా వినిపించుకోలేదు. తమ గ్రామానికే వస్తారా అంటూ నానా దుర్భాషలాడారు.
‘ఇప్పుడే మా సర్పంచ్‌కు ఫోన్ చేశాం. పోలీసుల దూకుడు ఎక్కువైంది. ఒక్కరిని చంపేస్తే ఇంకెవరూ గ్రామంలోకి రావడానికి ధైర్యం చేయరు’ అని బెదిరించారు. ఇంతలో వారిలో ఒకరు ఎస్‌ఐపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎస్‌ఐ ఎడమ చేతికి గాయమైందని సీఐ తెలిపారు.అక్కడి నుంచి వచ్చిన ఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు సర్పంచ్ బాలకృష్ణతోపాటు అతడి అనుచరులు ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 341, 353, 307, 506 రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ప్రధాన నిందితుడు సర్పంచ్ సద్దల బాలకృష్ణను కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
ఈనెల 26వ తేదీ రాత్రి గోరంట్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సర్పంచ్ సద్దల బాలకృష్ణ అనుచరులు కావడంతో.. ఎమ్మెల్యే సుధాకర్‌పై సర్పంచ్ ఒత్తిడి తెచ్చి వారిని విడిపించుకున్నారని అంటున్నారు. మద్యం అక్రమార్కులను వదిలిపెట్టడంతో ఎస్‌ఐ వేణుగోపాల్‌ను వీఆర్‌కు పంపారనే చర్చ జరుగుతోంది.