అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు ఈడీ నిర్ణయం?
posted on Jun 17, 2022 @ 10:59PM
కాంగ్రెస్ కు పుండు మీద కారం చల్లినట్లుండే నిర్ణయం ఈడీ తీసుకోబోతోందా? గాంధీ నెహ్రూ కుటుంబ ఆస్తిని ఈడీ జప్తు చేయబోతోందా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఔననే సమాధానం వస్తోంది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఐదే వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేయడానికి సన్నాహాలు చేస్తున్నదని తెలుస్తోంది.
ది అనలైజర్ కథనం ప్రకారం పరోక్షంగా గాంధీ కుటుంబం, ప్రియాంకా వాద్రాల యాజమాన్యంలోని అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. ఆ సంస్థకు చెందిన 5వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం వేధింపులలో భాగమే ఈడీ విచారణ అని అరోపిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే.
ఇప్పుడు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు ఈడీ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ ఆందోళనలను మరింత ఉథృతం చేసే అవకాశం ఉంది. కాగా అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థను 1930లో స్థాపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణ కోసం స్థాపించిన ఈ సంస్థ ఆ తరువాత గాంధీ కుటుంబం నిర్వహించింది.
ఈ సంస్థకు విరాళంగా వచ్చిన సొమ్ము దిర్వినియోగం అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కేంద్రం అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన రూ.90 కోట్ల రుణాన్ని ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనే ఈడీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం రికార్డు చేసింది. విచారణ సోమవారం కూడా కొనసాగనుంది. సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు.