కాంగ్రెస్ డౌన్ బట్ నాట్ అవుట్
posted on Jun 17, 2022 @ 5:40PM
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ముఠాల కుమ్ములాటలు కొత్త విషయం కాదు, విశేషమూ కాదు. అదొక మాములు విషయం. ఒక సహాజ లక్షణం.నిత్య క్రతువు.అందుకే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు, ముఠాల కుమ్ములాటలు లేకపోతే ఆశ్చర్యపోవాలిగానీ, లేదంటే అందులో ఆశ్చర్య పోవలసిన విషయం, విశేషం మరొకటి ఉందని అంటారు. నిజం ఒక్క, తెలంగాణలోనే కాదు దేశం అంతటా, అంతే. అదే పరిస్థితి.
అయితే, ఇప్పుడు గమ్మత్తుగా దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒకటిగా పోరాడుతున్నారు. నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విచారించదాన్ని వ్యతిరెకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు అంతా ఒకటిగా ఎక్కడ లేని ఐక్యతా ప్రదర్శిస్తున్నారు.నిజంగా, ఇదొక అపూర్వ చిత్రం. ఇక తెలంగాణ విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీలో జోష్ పెరిగింది. అదే సమయంలో అసమ్మతి కార్యక్రమాలూ జోరందుకున్నాయి.
ఒకదాని కొకటి సమాంతరంగా సాగడంతో, రైలు పట్టాల్లా ఒకదాని కొకటి కలవడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నిలిచి పోయింది. ఇదో ఎవరో చేసిన వ్యాఖ్యానం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా వ్యక్త పరుస్తున్న ఆవేదన. నిజానికి, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఒకటికి నాలుగు సార్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. అయినా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా, తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఇంతవరకు లభించలేదు.
అందుకే రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఆందోళనలు అన్నీ సక్సెస్ అయినా, అదే సమయంలో పార్టీలో అసమ్మతి కట్లు విప్పుకోవడంతో, సక్సెస్ వెంట ఫెయిల్యూర్ వెంటాడుతూ వచ్చింది. చివరకు పరిస్థితి బేరీజు వేసుకుంటే సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి అన్నట్లుగానే ఉందని పార్టీ పరిశీలకులే అంటున్నారు. కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నేతలఫై విశ్వాసం కోల్పోయారు. వీళ్ళంతే, మారరు’ అనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది.
అయితే ఇప్పుడు సోనియా,రాహుల్ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ.. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో ‘ఏ టూ జెడ్’ అన్ని గ్రూపుల నాయకులూ పాల్గొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఇంత మంది నాయకులు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఇంత సయోధ్య ఉందా? అనే అనుమానం వచ్చే విధంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
నాయకులే కాదు కార్యకర్తలు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ డౌన్ బట్ నాట్ అవుట్ అనే విశ్వాసాన్ని కలిగించింది. అలాగే ఇక్కడ మరో విషయం కూడా వెలుగు చూసిందని పరిశీలకులు అంటున్నారు. మాకు మాకు మధ్య వెయ్యున్నా,గాంధీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, కురు పాండవుల్లా మేమంతా ఒకటవుతామనే సందేశాన్ని కాంగ్రెస్ నాయకులు జనంలోకి పంపారని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈడీ విచారణలు దేశంలో చాలా మంది మీద జరుగుతూనే ఉంటాయి.
నిజానికి కొద్ది రోజుల ముందు ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గేను ఈడీ విచారించింది. ఆయన మందీ మార్బలం లేకుండా ఈడీ కార్యాలయానికి వెళ్లారు, ఈడీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి హుందాగా వచ్చారు. అదే విధంగా రాహుల్ గాంధి, సోనియా గాంధి కూడా హుందాగా విచారణకు హరరైతే, పార్టీ గౌరవం పెరిగేదని సమస్య ఉండేది కాదని, అందుకు విరుద్ధంగా దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయడం వలన, పార్టీ ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉందని పార్టీలో కొందరు గుసగుసలు పోతున్నారు. ఈడీ విచారణ వలన పార్టీలో వచ్చిన ఐక్యత ఎంత కాలం ఉంటుందో తెలియదు, కానీ, పడిన మచ్చ మాత్రం అంత త్వరగా పోదని అంటున్నారు.
అయితే, గతంలో ఎమర్జెన్సీ అనంతరం షా కమిషన్ విచారణ అధారంగా ఇందిరా గాంధీని మొరార్జీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా ఇలాగే, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అరెస్ట్’కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది. ప్రజలు ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. అదే సమయంలో జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తలెత్తి మొరార్జీ ప్రభుత్వం కూలి పోయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇందిరా గాంధీ మళ్ళీ ప్రధాని అయ్యారు. ఇప్పడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందనే గంపెడు ఆశతోనే కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చిందని అంటున్నారు. అయితే, అది 50 ఏళ్ల నాటి ముచ్చట, అప్పుడు టీవీ లేదు ఇప్పుడు టీవీ కాదు, ప్రతి చేతిలో ఇంటర్నెట్ వుంది.సో.. అప్పుడు జరిగిందే ఇప్పడు జరగాలంటే కాలం వెనక్కి వెళ్ళడం ఒక్కే మార్గం ..అది జరగదు..ఇది మాత్రం జరుగుతుందా.. ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు ..