బీహార్ లో జూన్ 19 వరకూ ఇంటర్నెట్ బంద్
posted on Jun 17, 2022 @ 11:25PM
‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో బీహార్ లోని 12 జిల్లాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోనికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 వరకూ రాష్ట్రంలోని 12 జిల్లాలలో ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు.
ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో యువత ఆందోళన చేస్తోంది. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువకులు అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తున్నారు. ఆర్మీ సర్వీస్ ను కేవలం నాలుగేళ్లకే పరిమితం చేయడంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బీహార్ లో ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ గురువారం నుంచి జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి.
భభువా రోడ్ రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ అద్దాలను పగలగొట్టిన నిరసనకారులు ఒక కోచ్ కు నిప్పు పెట్టారు. అర్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు.. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులు స్టేషన్ ఫర్నిచర్ ను ట్రాక్ పై విసిరేసి నిప్పుపెట్టారు. జెహానాబాద్ లో ఆందోళనకారుల నిరసనతో రైల్వే ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నవాడలో యువకులు రైళ్లను అడ్డుకుని ట్రాక్ పై టైర్లను తగలబెట్టారు.