ముందస్తే.. జగన్ కు ఏకైక ఆప్షన్!
posted on Nov 4, 2022 @ 10:35AM
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడున్నరేళ్లు ఒక చీకటి కోణం అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ఆర్థిక రంగంపై, ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై ఎలాంటి అవగాహనా లేకుండా ఇష్టారీతిగా హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టారు. సరే వాగ్దానాల ఫలితమో, మరోటో అధికారం దక్కింది. కానీ పాలనానుభవం లేకపోవడం. సలహాలను స్వీకరించే మనస్తత్వం కాకపోవడంతో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టింది.
మామూలుగా అయితే పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలను ఎవరూ విశ్వసించరు. కానీ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు. రాష్ట్రానికి మంచే జరిగిందో, చెడే జరిగిందో పక్కన పెడితే.. ప్రజాకర్షక పథకాలను అమలు చేయడంలో దివంగత రాజశేఖరరెడ్డి విజయవంతమయ్యారు. ఆ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందడంతో ఆయన జననేత అయ్యారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎడా పెడా హామీలిచ్చేస్తే జనం నిజమని నమ్మారు. కానీ మూడేళ్లు కాకుండానే ఆ హామీలలోని డొల్ల తనాన్ని జనం గుర్తించేశారు.
మూడేళ్లు గడిచిపోయిన తరువాత తాము ఇంత చేశాం.. అంత చేశాం అని చెప్పుకుంటూ గడపగడపకూ వెళుతున్న ఎమ్మెల్యేలపై జనం తిరగబడుతున్నారు. అమరావతి ఏకైక రాజధాని అమరావతికే నా మద్దతు అంటూ విపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాకా మూడు ముక్కలాట అంటూ మూడు రాజధానుల పల్లవి ఎత్తుకోవడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. తాను యథేచ్ఛగా ఎలాంటి అవాంతరాలూ, అడ్డంకులూ లేకుండా పాదయాత్ర చేసిన రాష్ట్రంలోనే.. ఎవరూ పాదయాత్రలు చేపట్టకూడదంటూ విధిస్తున్న ఆంక్షలు జనంలో అసంతృప్తికి కారణమౌతున్నాయి. ఇక జిల్లాల ఏర్పాటు దగ్గర నుంచి వాటికి నామకరణం వరకూ జగన్ సర్కార్ వేసిన కుప్పిగంతులు జనంలో జగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిల్చాయి.
ఒక్క చాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లే వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్.. తన పాలనా వైఫల్యాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బలి చేశారు. రాష్ట్రం రోజు వారీ అవసరాలకు కూడా అప్పు చేయకుండా గడవని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి రాజకీయ అవసరాల కోసం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతే అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తున్న కేంద్రం.. ఆ అవసరం తీరాకా పీకల మీద కూర్చుంటుందనడంలో సందేహం లేదు. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులు ఏపీ ఆర్ధిక స్థితిపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఇందుకు సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మీట నోక్కి జనం ఖాతాత్లో వేలకు వేల డబ్బులు జమ చేస్తున్నానని జగన్ అంటున్నారు. అయితే అందుకు చెగన్ ఫణంగా పెడుతున్నది రాష్ట్ర భవిష్యత్ అని ఇప్పుడు అదే జనం గుర్తిస్తున్నారు. అందుకు నిదర్శనమే గడపగడపకూ కార్యక్రమంలో లబ్ధిదారులే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించి నిలదీయడమని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటి వరకూ కేంద్రం దయాదాక్షిణ్యాలో, మరొకటో ఎలాగో అలా నెట్టుకోచ్చేసినా ఇక ముందు ఆ పరిస్థితి ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఇక పై ప్రభుత్వోద్యోగులకు జీతా లివ్వాలన్నా, కనీసం ప్రభుత్వం రోజువారీ వ్యయాలన మీట్ కావాలన్నా పైసా పుట్టని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక ముందు ఇప్పటి దాకా తాను నమ్ముకున్న సంక్షేమ మీటను నొక్కడానికి కూడా జగన్ కు అవకాశం ఉండదని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో జగన్ మునగాలన్నా,న తేలాలన్నా ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ ముందస్తు ఎన్నికలే. అంటే సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం. అదొక్కటే ఇప్పుడిక ఏపీ సీఎం జగన్ కు మిగిలిన మార్గమని పరిశీలకులే కాదు.. ప్రభుత్వ వ్యవహారాలపై గట్టి పట్టున్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు కూడా చెబుతున్న మాట. కేంద్రానికి జగన్ పట్ల ఎంత సానుకూలత ఉన్నా కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఏం చేయలేని పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. అలా కాకుండా మొండిగా అధికారాన్ని పట్టుకు వేళాడాలనుకుంటే.. అది జగన్ కే కాక రాష్ట్రానికి కూడా చేటేనని ఐవైఆర్ అంటున్నారు. పూర్తి కాలం అధికారంలో కొనసాగితే రాష్ట్రం మరింత అధోగతి పాలు కావడం తథ్యమంటున్నారు. ఆర్థికంగా దివాళా తీసి శ్రీలంక పరిస్థితులు ఎదురు కావడం తప్ప జగన్ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం వల్ల మరో ప్రయోజనం ఉండదంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం, ఐవైఆర్ ముందస్తే బెటర్ అంటూ ఒకింత వ్యంగ్యంగానైనా సూచించడం కాకతాళీయమైతే కావచ్చు కానీ జరిగేది మాత్రం అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.