ట్విట్లర్ లో కాస్ట్ కట్.. 3800 ఉద్యోగాలు కోత
posted on Nov 4, 2022 @ 11:17AM
ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తరువాత ఎలాన్ మస్క్ కాస్ట్ కట్ పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు. అనేక వివాదాల మధ్య ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న ఎలాన్ మస్క్ దాదాపు సగం మంది ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్ పంపినట్లు చెబుతున్నారు. అదెంత వరకూ వాస్తవమో తెలియదు కానీ.. కనీసంలో కనీసం 3800 ఉద్యోగాలకు కత్తెర వేసినట్లు సమాచారం.
అదే సమయంలో వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని రద్దు చేసి.. మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పని భారం మోపారని అంటున్నారు.ముఖ్యంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులపై ఈ భారం తీవ్రంగా ఉందంటున్నారు. ట్విట్టర్ ప్రొడక్ట్ మేనేజర్ ఎస్తర్ క్రాఫోర్డ్ ఆఫీసులో నేలపై నిద్రిస్తున్న ఫొటో ఇఫ్పుడు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతోంది.
దానికి కింద ట్యాగ్ చేసిన క్యాప్షన్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. మీ బాస్ నుంచి మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఇలా ఉండాల్సిందే అన్న ట్యాగ్ నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. దీనిపై ఎలాన్ మస్క్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.