కామ్రెడ్స్ ‘కోత’లపై ఉద్యమాలు చేయరా?
posted on Oct 20, 2012 @ 11:04AM
తినటానికి తిండి కరువు. ఉండటానికి గూడు కరువు. కట్టుకోటానికి బట్టల కరవు. ఈ కరువు కాలంలో సబ్సిడీల్లో కోత, ప్రజలకు వాత తప్పటం లేదు. అంతలా కోత విధించినా ఇంకా చాలదని ప్రభుత్వాలంటున్నాయి. ఒకవైపు గ్యాస్ తక్కువగా ఉందని కొత్త సిలెండర్ల మంజూరు ఆపేశారు. అంతటితో ఆగకుండా పేదలకు పంపిణీ చేసే ప్రజాపంపిణీ వ్యవస్థలోని చౌకబియ్యం వంటి వాటిలో కోత విధించింది. ఈ కోతతో పాటు కిరోసిన్ వంటివాటిని బ్లాక్‌లోకి నెట్టేశాయి. చిట్టచివరికి విద్యుత్తు సరఫరాలోనూ రాష్ట్రం అంధకారంలో మగ్గుతోంది. గ్రిడ్‌పై భారం పడుతోందని నాలుగు డిస్కంల సిఎండిలతోనూ సమన్వయకమిటీ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండి హీరాలాల్ సమారియా చెప్పారు. అంటే భవిష్యత్తులో మరింత కోత తప్పదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. గ్రిడ్‌ను కాపాడుకునేందుకు కోత పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో గ్రామీణప్రాంతాల్లోనూ నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అసమర్ధతకు ఈ కోతలే అద్దం పడుతున్నాయి. ఈ కోతల నుంచి తప్పిస్తే ప్రభుత్వసమర్ధత ప్రజలు అర్ధం చేసుకోవచ్చు. కానీ, రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కోతలు అనుభవించక తప్పదు. మరి ఇన్ని కోతలు అమలు చేస్తుంటే కామ్రేడ్లు ఏమి చేస్తున్నారు? ప్రతిపక్షం ఈ గ్రిడ్ సమస్యపై ఎందుకు స్పందించటం లేదు? ఉద్యమం కూడా పొదుపుగా చేయాలని కామ్రేడ్లు అనుకుంటున్నారా? వంటి పలు ప్రశ్నలు రాష్ట్రంలో ఉద్భవిస్తున్నాయి.