Read more!

కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకండి..

ఋతుచక్రాన్ని అనుసరించి కాలం మారుతుంది. ప్రకృతిలో కూడా మార్పు వస్తుంది. దేవీనవరాత్రులతో శరత్కకాలం మొదలవుతుంది కాబట్టి కార్తీకమాసంలో చలి ఉంటుంది.  ఈ మాసంలో కొన్ని ఆహారాలు తినకూడదని  శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటని చాదస్తం అని, మూఢనమ్మకాలు అని కొందరు తేలికగా కొట్టిపడేస్తారు. కానీ ఆయుర్వేదం కార్తీక మాసంలో అస్సలు తినకూడని పదార్థాలేవో శాస్త్రీయ ఆధారాలతో సహా చెప్పింది. వీటిని వాతావరణ మార్పుల ఆధారంగా నిర్ణయించినట్టు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కార్తీకమాసంలో అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..

 
మాంసాహారానికి దూరం ఉండాలి..

శ్రావణ మాసం, కార్తీకం, మాఘమాసం ఇలా పుణ్యప్రదమైన మాసాలు రాగానే మాంసాహారం తినకూడదు అనే నియమాలు పాటిస్తారు చాలా మంది. అయితే నేటికాలంలో హిందూ విశ్వాసాలను హేళన చేసేవారు తింటే ఏమవుతుంది? అని వితండవాదం చేస్తారు. ఆయుర్వేదం ఆహారాన్ని వివిధరకాలుగా  పేర్కొంది. వాటిలో మాంసాహారం తినడాన్ని భూత ఆహారం అని అంటారు. పుణ్యం సంపాదించుకోవాల్సిన కాలంలో భూత ఆహారం తినడం మహా పాపం అని పురాణం చెబితే.. శాస్త్రప్రకారం మాత్రం ఈ మాసంలో జంతువులలో పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది.  ఇలాంటి సమయంలో జంతువులను వధించి వాటి మాంసాన్ని తింటే వాటి పునరుత్పత్తి ప్రక్రియకు  నష్టం కలిగించినట్టే కాకుండా వాటి మాంసాన్ని తింటే బోలెడు రోగాలు కూడా వచ్చే ఆవకాశం ఉంటుంది.  ఈ మాసంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిగా ఉంటుంది. మాంసాహారం తింటే ఈ జీర్ణవ్యవస్థ మరింత బలహీనపడుతుంది. అందుకే కార్తీకమాసంలో మాంసాహారం అస్సలు తినకూడదు.

చల్లనీరు తాగకూడదు..

కొందరికి చల్లనీరు తాగడం అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఈకాలంలో పొరపాటున కూడా చల్లనీరు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. చల్లనీరు, చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల తొందరగా జలుబు, దగ్గు, శ్వాససంబంధ సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు చల్లని పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. చల్లనివాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదు.

ఈ పప్పులు అస్సలు వద్దు..

వంటలలో ఎక్కువగా ఉపయోగించే పప్పు ధాన్యాలలో కందిపప్పు, శనగపప్పు ముఖ్యమైనవి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వీటిని ఎక్కువ వాడుతుంటారు. కానీ కార్తీకమాసంలో ఈ రెండు పప్పు ధాన్యాలు అస్సలు వాడకపోవడం మంచిది. ఇవి సహజంగానే వాతగుణం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలు, కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు కలిగిస్తాయి.

కాకరకాయ  వద్దే వద్దు..

కాకరకాయ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మాములుగా కూడా కాకరకాయను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కాకరకాయను కార్తీకమాసంలో నిషేధించమని  ఆయుర్వేదం చెబుతోంది. కార్తీకమాసంలో కాకరకాయలు తొందరగా పండిపోతాయి.   కాకర గింజల్లో ఉండే బ్యాక్టీరియా ఈ కాలంలో చాలా అభివృద్ది చెందుతుంది. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడంతో పాటు అనేక ఇతర సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పొరపాటున కూడా కార్తీకమాసంలో కాకరకాయ తినొద్దని అంటున్నారు.  

                                      *నిశ్శబ్ద.