ఆ విషయంలో మాత్రం ట్రంప్, హిల్లరీ ఒకటయ్యారు..
posted on Jul 16, 2016 @ 11:07AM
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్సనాస్ర్తాలు విసురుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చారు. అదేంటబ్బా.. ఒకరు ఎడ్డెం అంటే.. ఒకరు తెడ్డం అంటారు.. అలాంటి వీరు ఒకే రకమైన అభిప్రాయానికి వచ్చారా.. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంతకీ వారు ఏ విషయంపై ఒకే అభిప్రాయానికి వచ్చారబ్బా అన్నడే కదా డౌట్..!
అదేంటంటే.. పారిస్ లోని నీస్ ఘటనపై స్పందించిన వీరు ఒకే అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘మనమో ప్రత్యేక ప్రపంచంలో నివసిస్తున్నట్టు ఉంది. ఇక్కడ శాంతిభద్రతలపై నమ్మకం లేదు. దేనిమీదా ఎవరికీ గౌరవం ఉండడం లేదు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చూస్తుంటే ఇది ప్రపంచ యుద్ధంలానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. "పరిస్థితి మొత్తం అదుపు తప్పింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, శాన్ బెర్నార్డినో, పారిస్, ఓర్లాండ్ ఘటనలను మనం చూశాం. బలమైన, స్మార్ట్ లీడర్ షిప్ లేకుండా పరిస్థితి మరింత దిగజారుతుంది’’ అని ట్రంప్ అన్నారు.
ఇక హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ‘‘ఇదో విభిన్న యుద్ధం. ఈ విషయంలో మనం సులభంగా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఇస్లాంను వాడుకుంటున్న జిహాదీలు, ఉగ్రవాదులతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. ఉగ్రవాద గ్రూపులు, రాడికల్ జిహాదిస్ట్ గ్రూపులపై యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు. మొత్తానికి అన్ని విషయాల్లో పరస్పరం విభేదించుకునే వీరు.. ఈ విషయంలో మాత్రం ఒక్కటవ్వడం ఆనందించాల్సిన విషయమే.
కాగా పారిస్ లోని నీస్ నగరంలో ప్రజలు బాస్టిల్ డే సంబరాల్లో ఉండగా.. ఓ ఉగ్రవాది ట్రక్కుతో వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు వందమంది మరణించగా.. వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి.