Read more!

దేవాలయ పరిరక్షణపై లఘు చిత్రోత్సవం

 

దేవాలయ పరిరక్షణ అంశంపై అంతర్జాయతీయ లఘు చలన చిత్రోత్సవం ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్.లో జరగబోతోంది. ఈ విషయాన్ని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ (యుఎస్ఎ) సంస్థల ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రోత్సవం జరుగుతుందని సంస్థల వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశరావు, సాంస్కృతిక ప్రచార సారథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిథిలావస్థలో వున్న దేవాలయాలను పరిరక్షించడం, సనాతన ధర్మ రక్షణ ఇలా ఎన్నో అంశాలపై ప్రజలకు అవగాహహన కల్పించే నిమిత్తం ఈ లఘు చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. చిత్రోత్సవంలో ప్రదర్శించే లఘు చిత్రం నిడివి 10 నుంచి 12 నిమిషాల మధ్య మాత్రమే వుండాలని, ఏ భాషలో నిర్మించినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తప్పనిసరిగా వుండాలని తెలిపారు. తమకు ఎంట్రీగా వచ్చిన లఘు చిత్రాలలో 40 లఘు చిత్రాలను ఆగస్టు 22, 23, 24 తేదీలలో హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్.లో ప్రదర్శిస్తామని చెప్పారు. ఉత్తమ లఘు చిత్రానికి లక్ష రూపాయల నగదు, బంగారు గోమాత, ద్వితీయ ఉత్తమ లఘు చిత్రానికి 75 వేల రూపాయలు వెండి గోమాత, తృతీయ ఉత్తమ లఘు చిత్రానికి 50 వేల నగదుతోపాటు కంచు గోమాతని ఇస్తామని, ఇంకా ప్రోత్సాహక బహుమతులు కూడా వుంటాయని నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం www.savetemples.orgని సంప్రదించవచ్చు.