Read more!

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!!

ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది. 

"ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె.

యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు.

"అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!" 

"తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు.

"సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె.

అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు.

వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది. 

అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి. 

అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని.

అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.

                                   ◆నిశ్శబ్ద.