తెలంగాణా అంశంపై త్వరలో నిర్ణయం: దిగ్విజయ్
posted on Jul 1, 2013 @ 8:05PM
రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మరో పదిరోజులలో తెలంగాణా అంశంపై స్పష్టమయిన నిర్ణయం ప్రకటించబోతున్నట్లు ఖరారు చేసారు. అయితే, ఆయన చెప్పిన కొన్ని విషయాలు అటు తెలంగాణా నేతలకి, ఇటు ఆంధ్రా నేతలకీ కూడా మింగుడుపడటం లేదు.
‘తెలంగాణాపై ఇదే ఆఖరి డెడ్ లైన్ గా భావించవచ్చా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకి అటువంటి దేమీ లేదని చెప్పారు. ఇప్పటికే అనేక డెడ్ లైన్లు గతంలో పెట్టడం జరిగిందని, అందువల్ల తానూ మళ్ళీ కొత్తగా మరొక డెడ్ లైన్ పెట్టదలచుకోలేదని అన్నారు. తెఅల్నగన సమస్యను రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్నీ పరిష్కరించవలసి ఉంటుందని, అందుకు శ్రీ కృష్ణా కమిటీ నివేదికతో సహా అన్ని నివేదికలను పరిగణనలోకి తీసుకొంటున్నామని చెప్పారు. అదే విధంగా తెలంగాణపై శాసన సభలో ఒక తీర్మానం ప్రవేశపెడతారని ఆయన చెప్పారు. కానీ కేంద్రం దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసారు.
దిగ్విజయ్ సింగ్ శ్రీ కృష్ణ కమిటీ ప్రస్తావన తేవడం, సీమాంధ్ర సభ్యులు అధిక సంఖ్యలో ఉన్న శాసన సభలో తీర్మానం పెడతామని చెప్పడం, యావత్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని చెప్పడం వంటివి గమనిస్తే, అవి తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖంగా నిర్ణయం ఉండబోతోందని సంకేతాలు ఇస్తున్నాయి. కానీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం తలెత్తే పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపైనే రోడ్డు మ్యాప్ గురించి అడుగుతున్నామని ఆయన చెప్పడం చూస్తే, తెలంగాణా ఇవ్వడం ఖాయమని అర్ధమవుతోంది. ఏమయినప్పటికీ, మరో పది రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం ప్రకటించ బోతోందని మాత్రం స్పష్టం అయింది.