ఏపీలో పొత్తులపై పవన్ ఢిల్లీ నుండి క్లారిటీ ఇచ్చారా.. కన్ఫ్యూజ్ చేశారా?!
posted on Jul 18, 2023 @ 4:12PM
ఏపీ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రోజులు గడిచే కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది పొత్తులు, సీట్ల పంపకాలు, అధికార భాగస్వామ్యం. ఇవన్నీ కుదిరితేనే పొత్తులు ఖరారై ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది. ఉమ్మడి మ్యానిఫెస్టోతో ప్రజల మధ్యకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఏపీలో మాత్రం నాలుగు నెలల నుండి ఈ పొత్తుల అంశం నాన్చివేత, సాగతీత ధోరణే సాగుతుంది. ఇదిగో తేలిపోతుంది అనుకునే లోపే ఎవరికి వారు ఆ ఊసే లేకుండా గడిపేస్తున్నారు. దీంతో ఒక దశలో ఇక పొత్తులు ఉండవని.. ప్రతిపక్షాలు పునరాలోచన చేస్తున్నాయనే ప్రచారం కూడా మొదలైంది.
కాగా, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పొత్తులపై క్లారిటీ ఇస్తారనే మరో ప్రచారం మొదలైంది. దీనికి కారణం ఆయన ఢిల్లీలో జరిగే ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావడమే. జులై 18 మంగళవారం ఢిల్లీలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి బీజేపీ కొత్త మిత్రులతో పాటుగా తన నుండి విడిపోయిన పాత మిత్రులను కూడా పిలిచింది. అయితే, రాజకీయ వర్గాలు భావించినట్లే ఏపీ నుండి టీడీపీకి పిలుపు రాలేదు. అదే సమయంలో జనసేనకి పిలుపు వచ్చింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మొత్తం 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరు అయ్యాయి. ఇది బీజేపీ బల ప్రదర్శన అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. ఇలాంటి బలప్రదర్శన సమావేశానికి కూడా టీడీపీకి ఆహ్వానం అందించలేదు. మరోవైపు ఢిల్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని.. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. 2019లో విడివిడిగా పోటీ చేశామని.. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామన్నారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణల అభివృద్ధి గురించి.. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. పవన్ వ్యాఖలను చూస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో టీడీపీ విడిగానే పోటీ చేస్తుందా? లేక పవన్ ఢిల్లీ నుండి పొత్తుల అంశంపై క్లారిటీతో ఏపీకి వస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీలో పవన్ వ్యాఖ్యలు, హావ భావాలు ఆయనలోని కన్ఫ్యూజన్ నే మరో సారి ఎత్తి చూపాయి. ఆయన తన కన్ఫ్యూజ్ ను అందరికీ వ్యాపింప చేసేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒక రాజకీయ వర్గం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ ఎన్డీయే భేటీలో చాలా విషయాల మీద బీజేపీ పెద్దల నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటారని.. ఏపీలో పొత్తులు ఉండాలంటే జగన్ తో బంధాన్ని బీజేపీ వదులుకోవాలని కండిషన్ పెడతారని తెలుస్తోంది. కానీ హస్తిన వేదికగా పవన్ మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఏం మాట్లాడారో, బీజేపీ పెద్దలు ఏం చెప్పారో స్పష్టతే లేకుండా పోయింది. ఏపీలో పొత్తులు అంటే వైసీపీని దించే పొత్తులుగా ఉండాలని.. ఏపీలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీని కూడా కలుపుకుని పోతేనే అది సాధ్యపడుతుందని మొదటి నుండి పవన్ చెబుతూ వచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని చెబుతూ వచ్చారు. ఆ దిశగా బీజేపీ హై కమాండ్ ను ఒప్పిస్తాననీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేసింది లేదు కానీ.. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూనే వస్తోంది. తాజాగా పవన్ కు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిసిన తరువాత కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితిలోనే ఉన్నారని ఆయన మాటలద్వారానే అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.