కావూరి రాజీనామా కధ కంచికి
posted on Feb 21, 2013 @ 5:35PM
తనను కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని అలిగి రాజీనామా చేసిన ఏలూరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుకి అకస్మాత్తుగా జ్ఞానోదయం అయినట్లుంది. ఆయనను కాంగ్రెస్ పార్టీ బొట్టు పెట్టి పిలవకపోయినా ఈ రోజు ఆయనంతట ఆయనే స్వయంగా పార్లమెంటు సమావేశాలకు హాజరవడమే కాకుండా, అమ్మ సోనియమ్మను కలుసుకొని తన రాజీనామాకు సంజాయిషీలు కూడా ఇచ్చుకొన్నారు.
తనకి మంత్రి పదవి ఈయకపోతే, కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తాను (కొల్లేరు సరసు ఉద్యమం మళ్ళీ మొదలుపెడతానని బెదిరింపు), విజయవాడ-హైదరాబాద్ రహదారులను దిగ్బంధం చేసేస్తానని బెదిరించిన ఆయనకు ఇంత అకస్మాత్తుగా జ్ఞానోదయం ఎందుకయిందని ఆలోచిస్తే, బహుశః ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో తానూ ఇంకా ఈ డ్రామా ఇలాగే కొనసాగిస్తే, కొత్తగా పార్టీ పగ్గాలు చెప్పటిన రాహుల్ గాంధీ తనకు బదులు మరో నాయకుడికి టికెట్ ఇచ్చేస్తే అప్పుడు తన కొంపే కోల్లెరవుతుందని గ్రహించినందునే ఆయన ఈ రోజు డిల్లీకి పరుగులు తీసి ఉంటారు.
యువకుడయిన రాహుల్ గాంధీ ఇటువంటి ముసలి నాయకులను వదిలించుకొని, యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తునందున, తన రాజీనామాను కనుక ఆమోదించేస్తే నష్టపోయేది తనే తప్ప, కాంగ్రెస్ పార్టీ కాదని ఆయనకీ అర్ధమయి ఉంటుంది. అందువల్లే, తన అలకలు వీడి బుద్దిగా పార్లమెంటులో కూర్చొన్నారు మన కావురివారు. బహుశః తెలంగాణా కాంగ్రెస్ నేతలకు కూడా త్వరలోనే ఇటువంటి జ్ఞానోదయమే కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చును.